'బాగుంది'... అనిపించిన సినిమా ఎప్పట్లాగే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో కొత్త రికార్డుల మాటా వినిపించింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. ఆ ఉత్సాహంలోనే వారం వారం ఐదారు సినిమాలకు తగ్గకుండా దూసుకొస్తున్నాయి. ఈ లెక్కన మన బాక్సాఫీసు గాడిన పడినట్టేనా? కరోనా సంక్షోభం నుంచి చిత్రసీమ తేరుకున్నట్టేనా?
'ప్రేక్షకులు మునుపటిలా వస్తారా? రారా?' అనే సందేహాల మధ్యే తెలుగునాట థియేటర్లు తెరుచుకున్నాయి. 50 శాతం మంది ప్రేక్షకులతో ప్రదర్శనలు మొదలయ్యాయి. రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు రాగానే సంక్రాంతి సినిమాలు ముస్తాబై బాక్సాఫీసు ముందుకొచ్చాయి. అలా తెలుగు సినీ పరిశ్రమ పునరుద్ధరణలో తొలి నెలలో విడుదలైనవి కీలకపాత్ర పోషించాయి. ఆ వెంటనే వందశాతం ప్రేక్షకులతో ప్రదర్శనలకు అనుమతుల రాకతో తెలుగు చిత్రసీమ మరో అడుగు ముందుకేసింది.
ఫిబ్రవరిలో మలుపు
మన దేశంలో కరోనా పరిస్థితుల తర్వాత వేగంగా కోలుకుంటున్న చిత్రసీమ మనదే. బాలీవుడ్‌లో ఇప్పటిదాకా విడుదలలే ఊపందుకోలేదు. మిగతా చిత్రసీమల్లో విడుదలవుతున్నా... వసూళ్ల జోరు కనిపించడమే లేదు. తెలుగులో మాత్రం సంక్రాంతి నుంచే వసూళ్ల గలగలలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో అయితే మరో అడుగు ముందుకేసింది. కొత్త రికార్డుల మాట వినిపిస్తూ 'ఉప్పెన' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.70 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓ హీరో తొలి సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషం. సంక్రాంతికి విడుదలైన 'క్రాక్' రూ. 70 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. యాభై శాతం మంది ప్రేక్షకులతో ప్రదర్శనలు కొనసాగినా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘క్రాక్’ ఆ స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకోవడం విశేషం. ఫిబ్రవరిలో విడుదలైన ‘జాంబీరెడ్డి’, ‘ఉప్పెన’, ‘నాంది’ చిత్రాలు మంచి వసూళ్లు సొంతం చేసుకున్నాయి. చిత్రసీమ గాడిన పడినట్టే అనే నిరూపించేలా ఫలితాల్ని రాబట్టాయి.