అగ్ర కథానాయకుల్లో చాలా మంది గురి సంక్రాంతిపైనే పడింది. ఇప్పటికే 'సర్కారు వారి పాట', 'రాధేశ్యామ్'తోపాటు పవన్‌కల్యాణ్ 'భీమ్లా నాయక్'.. ఈ మూడూ ముగ్గుల పండక్కి బెర్తులు ఖాయం చేశాయి. మరికొన్ని రేసులో కనిపిస్తున్నాయి. చివరికి పక్కాగా పండగ బరిలో నిలిచే సినిమాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రెండో దశ కరోనా మొదలు కాకముందు వరకూ 2022 సంక్రాంతి బరిలో రెండు సినిమాలే కనిపించాయి. ఒకటి.. పవన్‌కల్యాణ్ 'హరి హర వీరమల్లు', మరొకటి 'సర్కారు వారి పాట'. కరోనా తర్వాత కొత్త చిత్రాలు తెరపైకొచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' స్థానంలో, పవన్‌కల్యాణ్-రానా మల్టీస్టారర్ చిత్రం జనవరి 12న రానున్నట్లు ప్రకటించారు. మరోవైపు మహేశ్ 'సర్కారు వారి పాట' ముందే చెప్పినట్టు పండగ కోసమే ముస్తాబవుతుండగా, 'రాధేశ్యామ్' అనూహ్యంగా జనవరి 14న అంటూ విడుదల తేదీని ఖాయం చేశారు. దాంతో సంక్రాంతి బరి మరింత రసవత్తరంగా మారింది.
'పుష్ప'రాజ్‌తో పోటీ..
సంక్రాంతి ఒకేసారి ముగ్గురు అగ్రకథానాయకులు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం మంచిది కాదని సినీ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాల విడుదలలో మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్.. సంక్రాంతి కంటే ముందే వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్కు ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగే పవన్, అల్లు అర్జున్ 'పుష్ప'తో పోటీ పడక తప్పదు.