బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అంగ్రేజీ మీడియం'. గురువారం (నేడు) ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 2018లో క్యాన్సర్ బారిన పడిన ఈ నటుడు విదేశాల్లో వైద్యం చేయించుకున్నాడు. తాజాగా అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకకు హాజరుకాలేకపోతున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు ఇర్ఫాన్.
"అంగ్రేజీ మీడియం చిత్రం నాకు చాలా ప్రత్యేకమైంది. ఈ సినిమాలో ఎంత లీనమై నటించానో అదేవిధంగా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని భావించా. కానీ, అనారోగ్యానికి గురై ట్రైలర్ విడుదల వేడుకకు దూరమవుతున్నా. చాలా బాధగా ఉంది. ఏదిఏమైనా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటా. ఈ సినిమా అందరిలో నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ను ప్రతి ఒక్కరూ చూసి ఆనందించండి."