Gamanam Movie Shreya: "వెండితెర నలుపు తెలుపు నుంచి... రంగుల సినిమాగా రూపాంతరం చెందడం ఎంత విప్లవాత్మకమో... ఇప్పుడూ అంతటి కీలకమైన మార్పునే సెట్స్‌లో చూస్తున్నాం" అంటోంది ప్రముఖ కథానాయిక శ్రియ శరణ్. ఇలా వచ్చి అలా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ... నటిగా తనదైన ముద్ర వేసి ఇరవయ్యేళ్లుగా తెలుగు తెరపై సందడి చేస్తున్న అరుదైన కథానాయిక ఈమె. తొలినాళ్లలో ఎలా కనిపించేదో, ఇప్పుడూ అంతే అందంతో సందడి చేస్తోంది. ఓ బిడ్డకి జన్మనిచ్చిన శ్రియ ఇటీవల 'గమనం', 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాల్లో నటించింది. సుజనా రావు దర్శకత్వం వహంచిన 'గమనం' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించింది శ్రియ.
"చిన్నప్పట్నుంచే ఆరోగ్యంపై అవగాహన ఎక్కువ. అదంతా మా అమ్మ చలవే. యోగా, నృత్యం నేర్పించారు. అవే నా అందం వెనక రహస్యం. గర్భం దాల్చాక నాలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఆ సమయంలోనూ కథక్ చేస్తూ ఫిట్ నెస్‌పై దృష్టిపెట్టేదాన్ని. పిల్లలు పుట్టాక మన ప్రపంచమే మారిపోతుంది. రాధ పుట్టాక నాలోనూ చాలా మార్పులు వచ్చాయి. మేం ఎక్కడికి వెళ్లినా బ్యాగ్‌లు, సూట్‌కేసుల గురించే ఆలోచించేవాళ్లం. ఇప్పుడు ఎక్కడికెళ్లినా మా పాపని వెంటబెట్టుకుని వెళుతున్నాం. నాలో మార్పులు రావడమే కాదు, అమ్మగా బాధ్యతలూ పెరిగాయి".
"మహిళా దర్శకులతో పనిచేయడం నాకు కొత్త కాదు. కన్నడలోనూ, దీపా మెహతా దర్శకత్వంలో 'మిడ్‌నైట్ చిల్డ్రన్' అనే ఆంగ్ల చిత్రమూ చేశా. తెలుగులో సుజనా రావుతో ఇదే తొలిసారి. ఇదివరకు సెట్స్‌లో నేను, నా హెయిర్ డ్రెస్సరే అమ్మాయిలు ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ అమ్మాయిలు కనిపిస్తున్నారు. అదొక విప్లవాత్మకమైన మార్పు. మహిళల కథల్ని చెప్పడంతోపాటు... మహిళల సమస్యల్ని చర్చిస్తున్నాం. ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడొక విషయం చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గు పడటం లేదు. ఇదివరకు నెలసరి వస్తే, ఎంత నొప్పి ఉన్నా దర్శకులకి చెప్పే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు సెట్లో ఎక్కడ చూసినా అమ్మాయిలే కాబట్టి ఎవ్వరితోనైనా ఇలాంటి సమస్యల గురించి చెప్పుకోవచ్చు. కెమెరా వెనకాల అమ్మాయిలు ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా అమ్మాయిల కథలు తెరపైకొస్తాయి".