తెలుగు చిత్రసీమలో ఆలియా భట్ రెండో చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె చేయనున్నట్లు తెలుస్తోన్న ఆ రెండో ప్రాజెక్టు ఏంటంటే.. 'మేజర్'. అడివి శేష్ కథానాయకుడిగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
26-11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. దీన్ని తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో నిర్మిస్తున్నారు. అందుకే ఇప్పుడీ చిత్రానికి ఉత్తరాదిలో క్రేజ్ పెంచేందుకు.. శేష్‌కు జోడీగా ఆలియా భట్‌ను సంప్రదిస్తోందట చిత్రబృందం. ప్రస్తుతం ఈ భామ రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో ఇప్పుడామె చేతిలో 'బ్రహ్మాస్త్ర'తో పాటు పలు పెద్ద చిత్రాలున్నాయి.