టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్‌చరణ్‌పై ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి ప్రశంసల జల్లు కురిపించారు. 'రంగస్థలం' చిత్రంలో చరణ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
"చిన్నతనంలో ఎక్కువగా రామారావు(ఎన్టీఆర్) సినిమాలు చూసేదానిని. ఆయన నటించిన ‘మాయాబజార్’, ‘దాన వీర శూర కర్ణ’, ‘సీతా స్వయంవరం’ చిత్రాలను చూశాను. మనకు కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ, నా దృష్టిలో మాత్రం కృష్ణుడంటే ఎన్టీఆరే. ఎప్పుడైనా కళ్లు మూసుకుని కృష్ణుడిని స్మరిస్తే.. నాకు ఆయనే కనిపిస్తారు. అంతేకాకుండా.. ‘అన్నమయ్య’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘భక్త ప్రహ్లాద’ చిత్రాలను కూడా చూశాను. ఇటీవల నేను రామ్‌చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాను వీక్షించాను. ఆ సినిమా చాలా బాగుంది. చరణ్ నటన అద్భుతంగా ఉంది. వీటితోపాటు ‘మనం’ కూడా చూశాను."