తొలి ప్రేమ శిల లాంటిది.. శాశ్వతంగా గుర్తుండిపోతుంది. మలి ప్రేమ కల లాంటిది.. ఎన్నో కలలు వస్తుంటాయి. పోతుంటాయి. వెండితెరపై రసవత్తర ప్రేమకథలతో అలరించే నాయకానాయికలూ ఈ ప్రేమ భావనలకు అతీతులు కాదు. ప్రతిఒక్కరినీ ఆ తొలివలపు ఏదో ఒక సమయంలో తీయగా చుట్టుముట్టే ఉంటుంది. ఓ వయసుకొచ్చాక ప్రేమ సంద్రంలో మునిగి తేలడం వేరు.. తెలిసీ తెలియని వయసులో ఆ అపురూప భావనకు లోను కావడం వేరు. నిజానికి తొలి ప్రేమకథలు భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడల్లా మనసుల్ని సుతిమెత్తగా మీటుతుంటాయి. అలాంటి మధురమైన తొలి ప్రేమ భావనలు మన వెండితెర ముద్దుగుమ్మల జీవితాల్లో చాలానే ఉన్నాయి. ఆ ముచ్చట్లేంటి? అసలిప్పుడు ప్రేమ, పెళ్లిపై వాళ్ల అభిప్రాయాలేంటి తెలుసుకుందాం.
కిండర్‌గార్డెన్ రోజుల్లోనే..
"ఎప్పటికైనా ప్రేమ పెళ్లే చేసుకుంటా. ప్రస్తుతం ఓ గొప్ప ప్రేమికుడి కోసం ఎదురు చూస్తున్నా. కిండర్‌గార్డెన్‌కు వెళ్లే రోజుల్లోనే నేను తొలిసారి ప్రేమలో పడ్డా. ఆ అబ్బాయి పేరు ఆడమ్. అతనొక అమెరికన్ అబ్బాయి. 'టైటానిక్' సినిమా చూశాక లియోనార్డో డికాప్రియోపై మనసు పారేసుకున్నా. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నా. నాకు కాబోయే వాడికి హాస్య చతురత, పరిశుభ్రత ఉండాలి. అన్నింటి కంటే మంచి మనసు ముఖ్యం.’’
-శ్రుతిహాసన్
మూడు నుంచి పన్నెండో తరగతి వరకు!
"నా దృష్టిలో ప్రేమ అందమైన అనుభూతి. ప్రతిఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమలో పడే ఉంటారు. నేను మూడో తరగతిలోనే తొలిసారి ప్రేమలో పడ్డా. అది నా పన్నెండో తరగతి వరకు కొనసాగింది. ఆ అబ్బాయి పేరు నేను చెప్పను. తను చాలా అందంగా ఉండేవాడు. దూరం నుంచే చూసి ఇష్టపడేదాన్ని. కానీ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. పన్నెండో తరగతి వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాం. తనతో అప్పుడప్పుడు మాట్లాడినా.. ఆ విషయం ఎప్పుడూ బయట పడలేదు".
- పాయల్ రాజ్‌పుత్
అప్పట్లోనే అమ్మకి చెప్పా