"శారదా... నను చేరగా... ఏమిటమ్మా సిగ్గా...
ఎరుపెక్కే లేత బుగ్గ...
ఏమి రూపమది...ఇంద్రచాపమది
ఏమి కోపమది...చంద్రతాపమది
ఏమి... ఆ హొయలు...? ఏమి ఆ కులుకు.."
ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని ఊపేసిన పాట అది. కథానాయిక పేరునే చిత్ర శీర్షికగా పెట్టడం.. ఆ నాయిక పేరుతో ఓ పాట పుట్టడం.. అప్పట్లో ఆనవాయితీ. అదే వరుసలో వచ్చిన ఈ పాట అభినేత్రి శారద సినీ రూపానికి సరికొత్త గ్లామర్ అద్దింది. శారద పేరు తలవగానే.. చాలామంది ప్రేక్షకులకు ఈ పాట గుర్తొచ్చి తీరుతుంది. అంతలా ఒకప్పుడు ఆకట్టుకున్న పాట అది. ఈ పాటలో అక్షరక్షరాన భావ కవిత్వం సొగసులు పోతుంది. పరికిణీ, తెల్ల వోణీ, సిగలో మల్లెలతో ఈ పాటలో శారద హృదయాలను దోచుకుంటుంది. అత్యద్భుతమైన అభినయాన్ని మించిన అందం మరోటి ఉంటుందా? ఈ దృష్టి కోణంతో చూస్తే మహా ప్రతిభావంతురాలయిన శారద అందాల రాశి.. సమ్మోహన సౌందర్యాల ఊర్వశి.
ఔను.. శారద నిజంగా అభినయ ఊర్వశి. ఈ సంగతి ఆమెకు లభించిన జాతీయ పురస్కారమే చెప్తుంది. అప్పట్లో ఉత్తమ నటన ప్రదర్శించే నటీమణులకు జాతీయ స్థాయిలో ఊర్వశి పురస్కారంతో సత్కరించేవారు. అలా ఆ సత్కారాన్ని పొందిన శారద ఊర్వశి శారదగా మారి ఇటు ప్రేక్షకుల హృదయాల్లోనూ, అటు సినిమా చరిత్రలోనూ స్వర్ణాక్షరాలతో లిఖించగల ఖ్యాతి కేతనాన్ని దిగంతాలకు ఎగురవేసింది. గ్రేట్ లెజెండరీ యాక్టెస్ర్ శారద సినీసీమని సుసంపన్నం చేసింది.
రచ్చ గెలిచిన అభినయం..
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది అనాదిగా వస్తున్న నానుడి. అయితే రచ్చ గెలిచిన తరువాతే ఇంట గెలిచిన సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఈ నటీమణి. తెలుగు నటే కానీ, మలయాళ చిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యత్ అనదగ్గ మంచి పాత్రలెన్నో పోషించి.. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా విఖ్యాతి గాంచింది. ఆ తర్వాతే పుట్టిల్లయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఆమె ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. ఆమె మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించారు. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలంటూ నిర్మాత దర్శకులు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. అంతే.! ఆ తర్వాత తెలుగు సినిమాని ముచ్చటగా తన కొంగున ముడేసుకుంది. అపూర్వమైన తన నటనతో ప్రేక్షక జనాల కళ్లు తడిపేసింది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో అవిశ్రాంతంగా సినిమాలు చేసింది. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా, రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డుల విజేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ జాతీయ అవార్డు స్వీకర్తగా... చరిత్ర సృష్టించింది.
సరస్వతి శారదగా.. ఊర్వశి శారదగా
ముచ్చటయిన మూడక్షరాల మూడు పేర్లు శారద సొంతం. పుట్టగానే తల్లితండ్రులు పెట్టిన పేరు సరస్వతి. పెరిగి పెద్దయి సినీరంగంలో ప్రవేశించిన తరువాత ఆమె పేరు శారద. అభినయ ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న అవార్డు ఊర్వశి. ఇలా ఆమె మూడు పేర్లతో మూడక్షరాల సినీ ప్రపంచంలో తన ముద్ర ప్రగాఢంగా వేసింది. వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో 1945 జూన్ 25న శారద పుట్టింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవతీ దేవి. వారిది వ్యవసాయ కుటుంబం. శారదకి ఓ సోదరుడున్నాడు. ఆయన పేరు మోహనరావు. చిన్నతనంలో చెన్నయ్‌లో ఉంటున్న అమ్మమ్మ దగ్గర శారద పెరిగింది. అమ్మమ్మ చాలా క్రమశిక్షణతో అనేక ఆంక్షల మధ్య తనను పెంచిందని శారద చాలాసార్లు ఆనాటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అనుభవాల్ని సన్నిహితులతో పంచుకునేవారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో కూడా హీరోలు తనని తాకరాదని అడ్డు చెప్పేదట.
నాటక రిహార్శల్స్‌కి కేవలం ఆదివారాల్లో మాత్రమే అనుమతించేదట. అవన్నీ అమ్మమ్మ శారదకు మిగిల్చిన తీపి గుర్తులు. తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్లడం అంత ఇష్టం ఉండేది కాదు. అలాగని...ఆమె అభిరుచిని ఏనాడూ అడ్డగించలేదు. అభ్యంతరం చెప్పలేదు. శారద తల్లి సత్యవతీ దేవికి మాత్రం తన కూతురు సినిమాల్లో రాణించాలని బలీయంగా కోరుకునేది. కారణం...స్వతహాగా ఆమెకి నటిగా తెరపై కనిపించాలన్న ఆశ ఉన్నా నెరవేర్చుకోలేకపోయింది. దాంతో... తన కూతురినైనా ఆర్టిస్ట్‌గా చూడాలని ఆమె అభిలషించింది. ఆరేళ్ల వయస్సు నుంచే నృత్యాభినయంలో శారద శిక్షణ పొందింది. మొదట్లో అంతగా గుర్తింపునకు నోచుకోని పాత్రలతో సరిపెట్టుకున్న శారద ఆ తరువాత కొన్ని సినిమాల్లో హాస్య పాత్రల్లో కూడా కనిపించింది. నెమ్మది నెమ్మదిగా తన ప్రతిభకు రాణింపు తెచ్చే కీలక కధానాయిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి... అసమాన నటనకు శారద కూడా ఓ చిరునామా అనిపించేలా ఎదిగింది. ఆమె మొదటి సినిమా 1955లో వచ్చిన 'కన్యా శుల్కం'. ఇందులో ఆమె పాత్ర చాలా చిన్నది.