దాదాపు 200 సంవత్సరాల పరాయి పాలనకు చరమగీతం పాడేదాకా సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కళలు, కళాకారుల పాత్ర ఎన్నదగ్గది. ఈ ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న దశలోనే భారతీయ సినిమా మాటలు నేర్చింది. ఈ దశలో నాటి భారతీయ సమాజంలో వేళ్లూనుకుపోయి ఉన్న మూఢాచారాల నుంచి ప్రజలను చైతన్యపరుస్తూ స్వాతంత్య్ర పోరాటం దిశగా వారిని కార్యోన్ముఖులను చేసేలా చిత్రాలు వచ్చాయి. అంటరానితనం వద్దన్న మహాత్ముని ఆశయ స్ఫూర్తితో 'మాలపిల్ల' వంటి చిత్రాలు తీశారు. కలికి కృష్ణమూర్తి నవల ఆధారంగా తమిళంలో తీసిన 'త్యాగభూమి' (1939) చిత్రం ఈ వరుసలో చెప్పుకోదగ్గది. విడుదల కాగానే దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఈ చిత్రకథ ప్రముఖ తమిళ వీక్లీ 'ఆనంద వికటన్'లో సీరియల్‌గా రావడం ఒకింత ఊరట.
- స్వాతంత్య్రానంతరమూ జాతీయోద్యమం ఆధారంగా వివిధ భాషల్లో పలు చిత్రాలు వచ్చాయి. 1996లో మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారిగా ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన బహు భాషాచిత్రం 'కాలాపానీ' నాటి ఉద్యమ ఖైదీల కష్టాలను కళ్లకు కట్టింది. మలయాళంలో ప్రముఖ దర్శకుడైన ఐ.వి.శశి 1988లో మమ్ముట్టి, సురేష్ గోపి వంటి తారాగణంతో తీసిన భారీచిత్రం '1921' బ్రిటిష్ పాలకులపై కేరళలో 1920ల్లో తలెత్తిన మలబారు తిరుగుబాటును చూపుతుంది. 1824 ప్రాంతంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీపై ముమ్మారు దండెత్తి వీరమరణం పొందిన ధీరవనిత కిత్తూరు రాణి చెన్నమ్మ. ఈమె జీవితకథ ఆధారంగా బి.ఆర్.పంతులు 1961లో తీసిన కన్నడచిత్రం 'కిత్తూరు చెన్నమ్మ'లో బి.ఆర్.సరోజాదేవి ఆ పాత్ర పోషించారు.
8 ఆస్కార్‌లు గెలిచిన 'గాంధీ'
మహాత్ముడి జీవితకథ ఆధారంగా 1982లో రిచర్డ్ ఆటెన్‌బరో తీసిన 'గాంధీ' చిత్రం విశ్వవేదికపై 11 నామినేషన్లు పొంది, ఏకంగా 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం విశేషం. హిందీలో జాతీయోద్యమ కథలతో ప్రేమ్‌కహానీ (1975), క్రాంతి (1981) వంటి చిత్రాలు వచ్చాక.. మళ్లీ ఇరవై ఏళ్లకు నటుడు ఆమిర్‌ఖాన్ 'లగాన్', 'మంగళ్‌పాండే', 'రంగ్ దే బసంతి' వంటి చిత్రాలతో ఆ ఊపు తీసుకొచ్చారు. భగత్‌సింగ్. ఈ విప్లవయోధుడి జీవిత చరిత్రపై పూర్తి నిడివితో హిందీలో ఏకంగా ఏడు చిత్రాలు రూపుదిద్దుకొన్నాయి.
- జి.ఎస్.జమీర్ హుసేన్
తెలుగు బావుటా
స్వరాజ్య కాంక్ష కోసం ఆంగ్ల దొరలపై నిప్పుల చెరిగిన తెలుగు వీరుడు 'అల్లూరి సీతారామారాజు'. టైటిల్ రోల్ పోషిస్తూ సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఇందులో కృష్ణ అల్లూరి పాత్రలో పరాకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. 'ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు'లాంటి కృష్ణ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
రేనాటి సీమ కన్న సూరీడు 'సైరా'
స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ తిరుగుబాటునే కథాంశంగా 'సైరా' తెరకెక్కింది. భారతీయుల గుండెలను ఉప్పొంగేలా చేసిన ఆ ఉద్యమగాథను సజీవంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు మెగాస్టార్. 'రేనాడు వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి' అంటూ చిరంజీవి వెండితెరపై చేసిన గర్జనకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది.
తూటాకి రొమ్మువిరిచిన 'ఆంధ్రకేసరి'