ప్రసాద్ స్టూడియోకు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది. ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఆయన.. తన జాతీయ, రాష్ట్ర అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళయరాజా స్పందించారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.
'ఎన్నో సంవత్సరాలుగా నేను పొందిన అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్నాంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఆ వార్తలు ఎలా పుట్టాయో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నా గురించి వస్తున్న వార్తలు నిరాధారమైనవి' ఇళయరాజా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యానికి, ఇళయరాజాకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. స్టూడియో వ్యవస్థాపకుడు ఎల్వీ ప్రసాద్.. గతంలో స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్‌ను వాడుకోమని తనకు మాట ఇచ్చారని.. కానీ ప్రస్తుత యాజమాన్యం దానికి అంగీకారం తెలపడం లేదని.. స్టూడియోలోకి తనను రానివ్వడం లేదని చెబుతూ కొన్ని నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు ఇళయరాజా.
తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన ప్రస్తుత యాజమాన్యం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకూ కోర్టు సూచించడం.. అనంతరం ఇటీవల ఇళయరాజా స్టూడియోను ఖాళీ చేయడమూ జరిగింది.
ఇవీ చదవండి: