తన కలంతో ఎన్నో తెలుగు పాటల్ని రాసి.. ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రికి నటీనటుల నుంచి సాధారణ సినీ ప్రేక్షకుడి వరకు నివాళి అర్పిస్తున్నారు. తమదైన శైలిలో కవిత్వాలు రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయనపై తమకున్న ఇష్టాన్ని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు 'మాస్ట్రో' ఇళయరాజా కూడా ఓ వచన కవిత్వం రాశారు.
"వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతను, కవితాత్మను అందించి.. తనదైన ముద్రతో అందమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..
ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి.. అతి తక్కువ కాలంలో.. శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు..
మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి.. రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు.. రేపు రాబోయే " రంగమార్తాండ " కూడా.. సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో!!