తెలంగాణ

telangana

ఇళయరాజా.. సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు!

By

Published : Oct 24, 2021, 9:15 AM IST

ఆయన స్వరాలు.. మండు వేసవిలో మంచు తెమ్మెరలు.. తొలకరి వానతో జనించే మట్టి పరిమళాలు. ఆయన గమకాలు.. సాయం సంధ్యవేళ మేనిని చల్లగా తాకే చిరుగాలులు. ఏటి గట్టున లయాన్వితంగా వినిపించే జలతరంగిణుల గలగలలు. ఆయన సంగీతం.. ప్రకృతితో సంగమమై ధ్వనించే దేవరాగం. ఆ బాణీలు.. జానపద జావళీల జలపాతాలు.. సస్యగీతాల అమర కోశాలు. ఆయనే సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు.. ఇళయరాజా..!

Ilayaraja
ఇళయరాజా

'వేదం అణువణువునా నాదం' అంటూ ప్రళయగర్జన చేసినా.. 'కథగా.. కల్పనగా' అంటూ హృదయాలను మెలిపెట్టినా ఆయనకే చెల్లింది. భారతీయ సంగీత సామ్రాజ్య రారాజైనా.. మనసును మధు కలశంలా మార్చి స్వర సురధారలు కురిపించిన లయరాజైనా.. ఆయన ఒక్కరే. సప్తస్వరాల ప్రభను పుణికి పుచ్చుకుని.. తన సంగీత మాధుర్యంతో ప్రకృతినే పరవశింపచేసిన ఆ మ్యూజికల్ మ్యాస్ట్రో.. ఇళయరాజా అసమాన్యుడు.

ఆయన సంగీతం గంగా ప్రవాహం

సంగీతానికి దైవత్వాన్ని ఆపాదించిన స్వర మాంత్రికుడు. సంగీత వాయిద్యంపై ధ్వనించే ప్రతి శబ్దంపైనా పట్టున్న అరుదైన కళాకారుడు. ఉన్నది సప్తస్వరాల.. కానీ వాటితో రాజా పలికించే రాగాలెన్నో. ప్రతి రాగం హృదయాలను తాకి మనసును రంజింప చేస్తుంది. బాణీలను దారంలా మార్చి.. సాహిత్య కుసుమాలతో మాలకట్టి.. సంగీత సరస్వతికి గీతమాలికలు సమర్పించిన అపర భక్తుడు ఆయన. మంత్రాల్లాంటి స్వరాలతో.. అలౌకిక ప్రపంచంలో.. సంగీత ప్రియులను తన్మయత్వంలో ఓలలాడించిన ఇళయరాజా సంగీత దర్శకుల్లో అత్యంత అరుదైన ప్రతిభావంతుడు. ఆయన సినీప్రస్థానం ప్రారంభించి ఇంచుమించు యాభై ఏళ్లు. ఇప్పటికీ ఇళయరాజా సంగీతం అంతే నవ యవ్వనంతో ఉరకలు వేస్తుంటుంది. బాణీలకు అమరత్వాన్ని ప్రసాదించిన స్వరరాగ గంగా ప్రవాహం ఇళయరాజా..

అమ్మ పాటలే ప్రేరణగా..

తమిళ దేశం కళలకు కాణాచి. దక్షిణ తమిళనాడు తేని జిల్లా పన్నైపురంలో 1943 జూన్ 2న.. రామస్వామి, చిన తాయమ్మ దంపతులకు ఇళయరాజా జన్మించారు. ఆయన అసలు పేరు జ్ఞాన దేశికన్. ఇద్దరు సోదరులు ఆర్డీ భాస్కర్, గంగై అమరన్​. పెద్దనాన్న కుమారుడు పావలార్ వరదరాజన్​లతో జ్ఞానదేశికన్ బాల్యం హాయిగా గడిచింది. తండ్రి బోడినాయగనూర్ తేయాకు తోటలో చిరుద్యోగి, తల్లి పొలాల్లో పని చేసేది. అమ్మతో పొలం పనులకు వెళితే.. అక్కడ ఆమె పాడే జానపద గీతాలు జ్ఞానదేశికన్​లో ఏదో తెలియని శక్తిని నింపేవి. పసిపిల్లాడు సంగీతంపైన చూపిస్తున్న ప్రేమ చూసి తన తల్లి ఓ పాత హార్మోనియం పెట్టె కొని పెట్టింది. అదే ఓ సంగీత సామ్రాట్టును తీర్చిదిద్దే క్షణమవుతుందని బహుశా ఆమె అప్పటికి ఊహించి ఉండరు.

ఎన్నో కష్టాలకోర్చి..

హాయిగా గడిచిపోతున్న ఇళయరాజా బాల్యం చదువుల పట్టాలు ఎక్కింది. బడిలో చేర్చేప్పుడు అతడి పేరును జ్ఞాన దేశికన్ నుంచి డేనియల్ రాజయ్యగా మార్చారు తండ్రి. కానీ ఊర్లో అంతా రాసయ్య అని పిలిచేవారు. అప్పటివరకూ సాదాసీదాగా సాగిపోతున్న డేనియల్ రాజయ్య జీవితంలో అనుకోకుండా ఓ పెద్ద కుదుపు. తన ఏడో ఏట.. తండ్రి రామస్వామి పరమపదించారు. తీవ్రమైన కుంగుబాటుకు లోనైన రాజయ్యకు.. సంగీత పరికరాలే నేస్తాలయ్యాయి. అలా మెల్లగా వాయిద్యాలపై పట్టు సాధించాడు. కానీ ఇల్లు గడవటం కష్టంగా మారింది. తనలాగే సోదరులకూ సంగీతంపై ఆసక్తి ఉండటం వల్ల.. చదువులు పెద్దగా సాగింది లేదు. కుటుంబ పోషణ భారంగా మారుతున్న తరుణంలో..1958లో పెద్దనాన్న కుమారుడు పావలార్ వరదరాజన్ ఇళయరాజా సోదరులతో కలిసి పావలార్ బ్రదర్స్ ఆర్కెస్ట్రా పెట్టారు. అప్పుడు ఇళయరాజా వయసు కేవలం 14 ఏళ్లు. నలుగురు అన్నదమ్ములు కలిసి తిరగని ప్రదేశం లేదు. దాదాపు దక్షిణ భారతదేశం అంతటా పర్యటించారు. గుడిలో భజన కార్యక్రమాల దగ్గర నుంచి కచేరీల వరకూ పావలార్ బ్రదర్స్ ఆర్కెస్ట్రా ఉండాల్సిందే.

కొత్త పరవళ్లు

1968లో సోదరులతో కలిసి అవకాశాల కోసం చెన్నపట్టణం చేరుకున్నారు పావలార్ బ్రదర్స్. అదే సమయంలో క్లాసికల్ గిటార్, వయొలిన్, పియానో నేర్చుకున్నారు. 1970లో మ్యూజిక్ ప్రొఫెసర్ ధనరాజ్ మాస్టర్ ప్రోత్సాహంతో లండన్ ట్రినిటీ కాలేజీ పరీక్షకు హాజరయ్యారు ఇళయరాజా. కేరళకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు టీవీ గోపాలకృష్ణన్ వద్ద కర్ణాటక సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నారు ఇళయరాజా. అంతే కాదు లండన్ ట్రినిటీ కాలేజ్ వారి నుంచి క్లాసికల్ గిటార్​లో గోల్డ్ మెడల్ అందుకుని తన సత్తా చాటారు. ఇళయరాజా టాలెంట్ చూసిన ధనరాజ్ మాస్టర్.. ఆయనకు పాశ్చాత్య సంగీత సంచనాలు బిథోవెన్, మొజార్ట్​ల మ్యూజిక్​ను పరిచయం చేశారు. ఇక అక్కడి నుంచి ఇళయరాజా హృదయంలోని సంగీతం కొత్త పరవళ్లు తీయటం ప్రారంభించింది..

బాలూతో పరిచయం మరో మలుపు

ప్రముఖ బెంగాలీ సంగీతదర్శకుడు సలీల్ చౌదరి..అప్పట్లో చెన్నైలో మ్యూజిక్ రికార్డింగ్​లు చేసుకునేవారు. అలా ఓ సారి ఇళయరాజా సంగీతం విని ముచ్చటపడి..తన సినిమాలో గిటారిస్ట్​గా అవకాశం కల్పించారు. కానీ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాకపోవటం వల్ల ఊరికి వెళ్లిపోదాయమని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే గానగంధర్వుడు, ఆప్తమిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఇళయరాజాకు పరిచయం ఏర్పడింది. అప్పటికే గాయకుడిగా నిలదొక్కుకుంటున్న బాలు.. తన ఆర్కెస్ట్రాలో ఇళయరాజాకు శాశ్వత స్థానం కల్పించారు. అంతే కాదు కన్నడ సినీ పరిశ్రమను సంగీత దర్శకుడిగా ఏలుతున్న తెలుగు వ్యక్తి జీకే వెంకటేష్​ను ఇళయరాజాకు పరిచయం చేశాడు. అలా జీకే వెంకటేష్​కు అసిస్టెంట్ మారిన ఇళయరాజా.. ఒకటి కాదు రెండు కాదు 200 సినిమాలకు సంగీత సహకారం అందించారు.

అలా సంగీత దర్శకుడిగా..

1976 సంవత్సరం ఇళయరాజా కెరీర్​లో మరిచిపోలేని ఏడాది. తమిళ నిర్మాత అరుణాచలం.. తను తీస్తున్న 'అన్నకిల్లీ' సినిమా కోసం ఇళయరాజాను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. డేనియల్ రాజయ్య పేరును ఇళరాజా మార్చారు. అప్పటికే హెచ్ ఎం రాజా...సంగీత దర్శకుడిగా ఉండటం వల్ల.. మరొకరు రాజా అనే పేరుతో ఎందుకుని భావించిన అరుణాచలం.. ఇళయ అంటే చిన్న అని అర్థం వచ్చేలా 'ఇళయరాజా' అని తెరపేరుకు నామకరణం చేశారు. ఆ పేరే భారతీయ సంగీత సామ్రాజ్యంలో సూర్యుడిలా వెలుగులు విరజిమ్మింది. అన్నకిల్లీతో నవ్యగీతాల సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇళయరాజా. 'రామచిలుక' పేరుతో తెలుగులో డబ్ అయినా సంగీత దర్శకుడు సత్యం.. ఇళయరాజా ట్యూన్స్​ను అలాగే ఉంచేశారు. ఆ పాటలు ఇక్కడి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి.

మూస బాణీలకు చెల్లు

ఇళయరాజా సంగీత దర్శకుడిగా మారే సమయానికి.. ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉద్ధండులే ఉన్నారు. ఎలాంటి చిత్రానికైనా సంగీతాన్నివ్వగల కేవీ మహదేవన్, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు, సత్యం లాంటి దిగ్గజ సంగీత దర్శకుల మధ్య...ఇళయరాజా లాంటి కొత్త వ్యక్తి ఎలా నిలబడాలి.. ఎలా తనలోని ప్రతిభను నిరూపించుకోవాలి. ఇదే ప్రశ్న ఆయన మెదడును ఎప్పుడూ తొలిచి వేసేది. తనకు వచ్చే అవకాశాలను నిరూపించుకోవటమే కాదు.. చేసే బాణీలు పదికాలాల పాటు ప్రజలు పాడుకునేలా ఉండాలని బలంగా కాంక్షించే వారు ఇళయరాజా. యువతకు చేరువయ్యే విధంగా ఉత్సాహ భరితమైన సంగీతాన్ని వినిపించేందుకు తాపత్రయపడేవారు. అలా ఓ అద్భుతమైన అవకాశం 1978లో ఆయన వద్దకు వచ్చింది. వెండితెర వేల్పులుగా ఇప్పుడు ఆరాధనలందుకుంటున్న కమల్ హాసన్, రజనీ కాంత్ కలిసి నటించిన 'వయసు పిలిచింది' సినిమాతో మూస బాణీలను బద్ధలు కొట్టాడు ఇళయరాజా. పాశ్చాత్య సంగీతాన్ని తలపించే బీట్స్ తో.. అప్పటి కుర్రకారును చిందులేయించాడు. ప్రత్యేకించి 'మబ్బే మసకేసిందిలే' పాట ఆల్ టైం గ్రేట్ హిట్​గా నిలిచింది.

తెలుగులో చిరంజీవితో 'ఆరాధన', కృష్ణతో 'జమదగ్ని' లాంటి సినిమాలకు ఇళయరాజాతోనే మ్యూజిక్ చేయించారు భారతీరాజా. మరి బాలుమహేంద్ర ఏమన్నా తక్కువవాడా.. రాజాతో కలిసి 'నిరీక్షణ' చిత్రం కోసం రూపొందించిన పాటలు మర్చిపోగలమా. భానుచందర్, అర్చన కాంబినేషన్ కోసం 'చుక్కల్లే తోచావే' అంటూ జేసు దాస్ ప్రాణం పెట్టి పాడినా.. 'ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది' అంటూ జానకమ్మ పాడిన పాటైనా.. వింటూ ఉండిపోవటం తప్ప ఏం చేయగలం. 'వసంత కోకిల' చిత్రంలో కమల్- శ్రీదేవి నటనకు ఇళయరాజా మ్యూజిక్ ఎంత అద్భుతమో చూసిన వాళ్లకే అనుభవం..

చిరంజీవిలోని డ్యాన్సర్​ను వెలికితీసేలా..

వెండితెరపై తనను నిరూపించుకోవాలనే కసితో ఉన్న నటుడు చిరంజీవి. పాటలకు లయబద్ధంగా డ్యాన్స్​లు వేయగలడు. నటనతో ఎంతటివారినైనా మెప్పించగలడు. అలాంటి చిరంజీవి.. ఇళయరాజా సంగీతానికి కథా వస్తువు. ఇక ఆ కాంబినేషన్ చూడాలి. తెలుగు సినీ సంగీతంలో స్వర్ణయుగం అంటే.. కచ్చితంగా గుర్తొచ్చే జోడీ.. చిరంజీవి-ఇళయరాజా. 1983లో 'అభిలాష' చిత్రం కోసం ఇళయరాజా స్వరపరిచిన 'నవ్వింది మల్లెచెండు', 'సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది', 'బంతీ చామంతీ'.. ఇలా ఒకటేంటి జ్యూక్ బాక్స్ మొత్తం ఎవర్ గ్రీన్ సాంగ్సే. 1984లో వచ్చిన 'ఛాలెంజ్' కోసం చిరంజీవి, విజయశాంతి పోటీపడి నర్తించిన 'ఇందువదన కుందరదన'.. 'రాక్షసుడు' చిత్రం కోసం 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', కొండవీటి దొంగ చిత్రం కోసం 'శుభలేఖ రాసుకున్నా' లాంటి సూపర్ హిట్ పాటలను అందించారు ఇళయరాజా. కోదండరామిరెడ్డి-రాజా కాంబినేషన్ లో మొత్తం 14సినిమాలు రాగా.. నటుడితో పాటు చిరంజీవిలో గొప్ప డ్యాన్సర్ ను వెలికి తీసేందుకు ఈ సంగీతం, పాటలు చాలా ఉపయోగపడ్డాయి..

శాస్త్రీయ సంగీతంతో పరిపూర్ణత

ఏ సంగీత దర్శకుడికైనా కమర్షియల్ సినిమాలతో పాటు.. సంప్రదాయ శాస్త్రీయ సంగీతం ప్రధానమైన సినిమాల్లోనూ రాణించినప్పుడే పరిపూర్ణత్వం. సరిగ్గా అలాంటి అవకాశం కోసం చూస్తున్న ఇళయ రాజా కోసం.. కళాతపస్వి కె.విశ్వనాథ్ 'సాగరసంగమం' అవకాశాన్ని కల్పించారు. అందులో 'వేదం అణువణువున నాదం','నాద వినోదము-నాట్య విలాసము' అంటూ నటరాజు కదిలేలా కీర్తించినా.. 'మౌనమేలనోయి ఇది మరపురాయి రేయి' అంటూ మెలోడితో అమృతధార కురిపించినా రాజాకే చెల్లింది. ఇక 'తకిట తదిమి' అంటూ ఆడుకున్న స్వరవిన్యాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా. 'సాగర సంగమం' చిత్రం ఇళయరాజా ఖ్యాతిని జాతీయ స్థాయికి చేర్చింది. 1983 సంవత్సరానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు ఇళయరాజా. 1986లో మళ్లీ కమల్ హాసన్​తో కలిసి విశ్వనాథ్ తీసిన స్వాతిముత్యానికి ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్ అవార్డులకు వెళ్లిన ఆ చిత్రం మన రాజాగారి సంగీత ప్రభను ఖండాంతరాలకు విస్తరించింది. 'మనసు పలికే మౌనగీతం', 'సువ్వి సువ్వి సువ్వాలమ్మా' పాటలు హృదయాలను మీటగా.. 'లాలీ లాలీ' అంటూ పాడిన లాలపాట బాణీ.. ఎందరి పసిబిడ్డలను హాయిగా నిద్రపుచ్చిందో లెక్కే లేదు.1988లో వచ్చిన స్వర్ణకమలం మళ్లీ ఆ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ను పునరావృతం చేసింది. 'అందెల రవమిది', 'ఘల్లు ఘల్లు', 'ఆకాశంలో ఆశల హరివిల్లు'.. ఆహా.. అన్నీ శాశ్వతంగా నిలిచిపోయే పాటలే.

వంశీతో పాటల పూతోట

దర్శకుడు వంశీతో.. ఇళయరాజాకున్న అనుంబంధం చాలా ప్రత్యేకమైనదేమో అనిపించకమానదు. వంశీలోని సృజనాత్మకతకు ఊతంలా నిలుస్తూ.. రాజా ఇచ్చిన బాణీలు.. గోదారంత అందంగా ప్రతి సినిమాలో ప్రేక్షకులపై సమ్మోహనాస్త్రాలు విసిరాయి. 1983లో విడుదలైన 'సితార' చిత్రం కోసం రూపొందించిన 'జిలిబిలి పలుకుల మైనా' పాట భాను ప్రియ అందాన్ని ద్విగుణీకృతం చేసేదే.1985లో వచ్చిన అన్వేషణ చిత్రం కోసం 'ఏకాంత వేళ కబుర్లు' అంటూ గిల్లినా.. రాజేంద్రప్రసాద్ కోసం ప్రేమించు పెళ్లాడులో 'వయ్యారి గోదారమ్మ కలవరం' అన్నా, 'గోపీ లోలా నీపాల పడ్డాను రా' అంటూ లేడీస్ టైలర్ కోసం.. రాజా చేసిన మ్యాజిక్కే వేరు. చెట్టు కింద ప్లీడరు చిత్రం కోసం సమకూర్చిన స్వరాలు.. ఏప్రిల్ 1 విడుదల కోసం ' మాటంటే మాటేనంట'.. మహర్షి కోసం 'మాట రాని మౌనమిది' అని మాటల పాటల మీద చేసిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుమానాస్పదం చిత్రం కోసం కట్టిన 'ప్రతి దినం నీ దర్శనం దొరకునా' బాణీ వరకూ ఇళయరాజా-వంశీ కాంబినేషన్ అంటే ఓ ఎవర్ గ్రీన్ జ్యూక్ బాక్స్. చెప్పాలంటే మాటలు సరిపోవు. అది అనుభవేక వైద్యమే..

మణిరత్నంతో మాయాజాలం

ఇక మణిరత్నంతో ఇళయరాజా చేసిన మాయాజాలం గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలి. 'నాయకుడు' సినిమా కోసం ఇచ్చిన పాటలు.. మణిరత్నం టేకింగ్ అద్భుతం. 'నీలాల కన్నుల్లో పన్నీటి ముత్యాలు' లాంటి పాటలు నేటికి ఏదో మూల వినిపిస్తూనే ఉంటాయి. 1988లో మణిరత్నం తీసిన ఘర్షణ చిత్రంలో 'నిన్ను కోరి వర్ణం' పాట పంచిన రంగులు మరిచిపోగలమా. 1989 'గీతాంజలి' సినిమాతో నేరుగా తెలుగులో సంచనలమే రేపాడు మణిరత్నం. ఆ సినిమా కోసం రాజా చేసిన పాటలు.. ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేటికీ ఓ ట్రెండ్ సెట్టర్​గా మాట్లాడుకుంటున్నామంటే అదీ ఇళయరాజాలోని గొప్పదనం. 'ఆమని పాడవే హాయిగా', 'నంది కొండా వాగుల్లోన', 'ఓ ప్రియా ప్రియా', 'ఓ పాపా లాలి', 'జగడ జగడం'..ఏ పాట తక్కువని చెప్పాలి.. అసలు సాధ్యమే కాదు.

90 దశకంలోనూ మణిరత్నం- ఇళయరాజా మ్యాజిక్ వసివాడలేదు. 'అంజలి' చిత్రం కోసం చేసిన ట్యూన్స్, ఆ బీజీఎం ఈ రోజుకీ చాలా కొత్తగా అనిపించకమానదు. ఇక సూపర్ స్టార్స్ రజనీకాంత్, మమ్ముట్టి హీరోలుగా మణిరత్నం తీసిన 'దళపతి' చిత్రమైతే.. రాజా కెరీర్​లో మోస్ట్ మెమరబుల్ ఆల్బమ్​గా చెప్పొచ్చు. ప్రత్యేకించి ఆ సినిమా కోసం చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. భారతీయ సినీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినది. 'సింగారాలోన పైరుల్లోన' లాంటి మాస్టర్ క్లాస్ హిట్ సాంగ్స్​తో పాటు.. 'చిలకమ్మా చిటికేయమంట' లాంటి సాంగ్స్ కోసం బ్యాక్ గ్రౌండ్.. రాజా కంపోజ్ చేయించిన సింఫనీ బీట్స్.. నభూతో న భవిష్యతి.

మరికొన్ని పాటలు

  • తన మిత్రుడు భారతీరాజాతో కలిసి ఇళయరాజా చేసిన సమ్మోహనాన్ని ఏమని వర్ణించాలి. ఎర్రగులాబీలు సినిమా కోసం 'ఎర్రగులాబీ విరిసింది' అని బాణీలిచ్చినా.. సీతాకోక చిలుక చిత్రం కోసం 'మాటే మంత్రము' అని ఆల్ టైం గ్రేట్ ట్యూన్ ఇచ్చినా.. 'మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా'.. వేటూరి పదాలకు స్వర విన్యాసాలు చేసినా ఆ జోడిని ఏమని పొగడాలి. జస్ట్‌ కళ్లు మూసుకుని.. ఆ పాటల మాయాజాలంలో మనల్ని మనం మరిచిపోవాల్సిందే.
  • 1986లో 'మంచి మనసులు' చిత్రం కోసం ఆత్రేయ రాసిన 'ఆకాశమల్లే వేచాను నీ రాకకై' పాట కోసం.. ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ ఎన్నాళ్లైనా వినిపిస్తూనే ఉంటుంది.
  • 'షిర్డీ సాయిబాబా మహత్య్మం' కోసం ఇచ్చిన పాటలు.. నేటికీ సాయి బాబా ఆలయాల్లో మారుమోగుతూనే ఉంటాయి.
  • కమల్ హాసన్ 'గుణ'లో తనలోని ప్రేమను హీరోయిన్​కు డిక్టేట్ చేస్తూ..'కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృదయమే' పాట..
  • శివాజీ గణేశన్ తో కలిసి కమల్ హాసన్ నటించిన 'క్షత్రియపుత్రుడు'లో 'సన్న జాజి పాడేకా' అంటూ ట్యూన్ చేసిన తమిళ జానపదం మట్టి వాసనలను వెదజల్లుతుంది.
  • 'మహానది' సినిమా కోసం 'శ్రీరంగ రంగ' గీతం ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టనే కొట్టదు.
  • షారూఖ్ ఖాన్​తో కలిసి కమల్ నటించిన 'హే రామ్' చిత్రం కోసం చేసిన 'వైష్ణవ జనతో' ఇళయరాజా ప్రత్యేకతను ఘనంగా చాటేవే..
  • అభినందన సినిమాలో పాటలు వింటే మరిచిపోగలమా.. 'మంచు కురిసే వేళలో' అంటూ శోభన చేసిన డ్యాన్స్ టైం లైస్ బ్యూటీ అసలు.
  • కృష్ణవంశీ 'అంతపురం' చిత్రం కోసం సౌందర్య-సాయికుమార్ కాంబినేషన్​లో వచ్చే 'అసలేం గుర్తుకురాదు' పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినిపించాలనిపించేదే.
  • లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్​తో తీసిన 'విచిత్ర సోదరులు', 'మైఖేల్ మదన కామరాజు' లాంటి చిత్రాల కోసం ఇళయరాజాతో కలిసి వర్క్ చేశారు. విచిత్ర సోదరులులో 'నిన్ను తలచి మైమరిచా చిత్రమే', మైఖేల్ సినిమా కోసం సింగీతంతోనే పాడించిన 'కథ చెబుతా కథ చెబుతా' పాటలు ఎప్పటికీ వన్నె తగ్గనివే. నందమూరి బాలకృష్ణతో 'ఆదిత్య 369'లో 'జాణవులే నెరజాణవులే' అంటూ చేసిన మ్యాజిక్ మామూలు పాటా?
  • రామ్ గోపాల్ వర్మతో సినీ మూస ధోరణులను బద్దలు కొడుతూ తెరకెక్కించిన 'శివ' చిత్రంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ కోసం.. చిరంజీవి-శ్రీదేవి-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన 'జగదేకవీరుడు-అతిలోక సుందరి' చిత్రంలోని గీతాలు.. 'నిర్ణయం' సినిమాలో నాగార్జునతో 'హలో గురూ ప్రేమ కోసమేరో జీవితం' అంటూ చేసిన ఆకతాయి అల్లరి..విక్టరీ వెంకటేష్​తో 'ప్రేమ', 'బొబ్బిలి రాజా', 'సూర్య ఐపీఎస్', 'చంటి'.. ఇలా ఒకటా రెండా ఇళయరాజా కెరీర్​లో. 'రుద్రవీణ' చిత్రం కోసం లలిత ప్రియ రాగంలో చేసిన లలిత ప్రియ పాటను అంత తేలికగా మరిచిపోగలమా.

అవార్డులు-రివార్డులు

  • జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా మొదటి పురస్కారం 1984లో 'సాగర సంగమం' చిత్రానికి రాగా.. 1986లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'సింధు భైరవి' చిత్రానికి రెండో పురస్కారం అందుకున్నారు రాజా. 1989లో చిరంజీవి హీరోగా కె.బాలచందర్ దర్శతత్వం వహించిన 'రుద్రవీణ' చిత్రానికి ముచ్చటగా మూడో పురస్కారం రాజాను చేరింది. 2009లో కేరళవర్మ ఫాసీ రాజా అనే మలయాళ చిత్రానికి, 2016లో థరాయ్ తప్పట్టాయ్ అనే తమిళ చిత్రానికి రెండు సార్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో జాతీయ పురస్కారాలను అందుకున్నారు ఇళయరాజా.
  • 2015లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-ఇఫీ.. ఇళయరాజాను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
  • 6సార్లు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను అందుకున్నారు ఇళయరాజా.
  • ఉత్తమ సంగీత దర్శకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 5 సార్లు నంది అవార్డులను అందుకున్నారు.
  • తమిళనాడు నుంచి 6సార్లు ఉత్తమ సంగీతదర్శకుడి సత్కారాన్ని పొందారు ఇళయరాజా.
  • తమిళనాడు ప్రభుత్వం కలైమామణి గౌరవాన్ని ఇచ్చి సత్కరించింది..
  • ఇళయరాజా ఘనతలు అంతటితో అయిపోలేదు. భారతదేశంలో అంతెందుకు ఆసియా ఖండంలోనే మరే సంగీత దర్శకుడికి సాధ్యం కాని శిఖరాలను రాజా అధిరోహించారు. లండన్​లో ప్రఖ్యాత రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఫుల్ సింఫనీ నిర్వహించిన ఇళయరాజా. .ఈ ఘనత వహించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు.
  • లండన్ రాయల్ ఆర్కెస్ట్రాతో సింఫనీ నిర్వహించిన తొలి ఆసియా సంగీత దర్శకుడిగా ఘనత వహించారు ఇళయరాజా. వారి నుంచే 'మ్యాస్ట్రో' గౌరవాన్ని అందుకున్నారు.
  • బుడాపెస్ట్, హంగేరీ, ఇటలీ దేశాలకు చెందిన సింఫనీలతో కలిసి కొన్ని వందల పాటలకు ట్యూన్​లు చేశారు ఇళయరాజా. మాణిక్యవసక్కర్ విరచించిన ప్రాచీన తమిళ పద్యాలను కలగలిపి.. 2006లో ఇళయరాజా..'తిరువాసగమ్ ఇన్ సింఫనీ' పేరుతో ఒరటోరియో నిర్వహించారు. మన దేశంలో ఒరటోరియో నిర్వహించిన ఏకైక సంగీత దర్శకుడు ఇళయరాజా మాత్రమే.

రికార్డులు

  • 1996లో మిస్ వరల్డ్ పోటీలకు నేపథ్య సంగీతం అందిచిన ఇళయరాజా.. 'చంటి' సినిమాకు 45నిమిషాల్లో ట్యూన్స్ రూపొందించి రికార్డును నెలకొల్పారు.
  • ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ 'అజంతా' అనే చిత్రం కోసం నాలుగు భాషల్లో ఒకే రోజులో 38 ట్యూన్లు ఇచ్చి చెక్కుచెదరని ఆయన స్థాయిని నిరూపించుకున్నారు.
  • భారతీయ చలన చిత్రం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013లో సీఎన్ఎన్-ఐబీఎన్ ఓ పోల్​ను నిర్వహించగా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకూ వచ్చిన అత్యుత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు ప్రేక్షకులు పట్టం కట్టారు.
  • 2014లో అమెరికన్ వరల్డ్ సినిమా పోర్టల్ 'టేస్ట్ ఆఫ్ సినిమా'.. ప్రపంచ సినీ చరిత్రలో అత్యుత్తమ 25 సంగీత దర్శకుల పేరుతో జాబితా విడుదల చేయగా.. అందులో ఇళయరాజాకు 9వ స్థానం దక్కిందంటే.. వరల్డ్ మ్యూజిక్ పై ఇళయరాజా చూపించిన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
  • స్వాతిముత్యం, నాయగన్, థేవర్ మగన్, అంజలి, గురూ, హేరామ్ చిత్రాలతో ఆరుసార్లు ఆస్కార్ బరిలో నిలిచిన సంగీత దర్శకుడిగా ఇళయారాజా రికార్డులు నెలకొల్పారు.
  • తన తొలినాళ్లలో ఉపయోగించిన హార్మోనియాన్నే నేటికి వాడుతున్న ఇళయరాజా..ఇంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినా.. ట్యూన్​ను మొదట హార్మోనియంపైనే సరి చూసుకోవటం అలవాటు.
  • భారతీయ సినీ సంగీత ప్రపంచానికి అందించిన సేవలకుగానూ 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు ఇళయరాజా.
  • సంగీతానికి నాలుగున్నర దశాబ్దాలుగా చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మభూషణ్, 2018లో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్'ను అందించి గౌరవించుకుంది.
  • 45 సంవత్సరాలలో 20వేలకు పైగా కచేరీలు నిర్వహించిన ఇళయరాజా.. మరే భారతీయ సంగీత దర్శకుడికీ సాధ్యం కాని రీతిలో అక్షరాలా వెయ్యికి పైగా సినిమాల్లో 7వేలకు పైగా పాటలకు బాణీలు అందించి..శిఖరాగ్రాన నిలిచారు.

ఎన్నో సినిమాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన స్వరబ్రహ్మ. అందుకే సినీ సంగీతం ఉన్నంతవరకూ ఇళయరాజా.. ఇసై జ్ఞానిగా నిలిచిపోతాడు. మ్యాస్ట్రోగా సంగీత ప్రియుల నీరాజనాలు అందుకుంటూనే ఉంటాడు.

ఇవీ చూడండి

లతా మంగేష్కర్.. జీవన గీతాసారం

చిరునవ్వుకు చిరునామా మురళీమోహనం

అభినయ వేదం 'చంద్రమోహనం'

ఆయన అక్షరం తెలుగు పాటకు వెలుగు బాట

ABOUT THE AUTHOR

...view details