సమంత అంటే అందం మాత్రమే కాదు.. అభినయం అని చెప్తాయి ఆమె పోషించిన పాత్రలు. కెరీర్ తొలినాళ్లలో అందరు కొత్త నాయికల్లాగే గ్లామర్ పాత్రలతో మెప్పించిన సమంత స్టార్‌గా మారాక తనలోని అసలు సిసలు నటిని బయటకు తెచ్చింది. నటనా ప్రాధాన్య పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే నటిగా ఇంత ఎత్తుకు ఎదిగినా సెట్లో ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉంటా అంటోంది సమంత.
"చిత్రసీమలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ ఓ తెలియని భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. సెట్లో దర్శకుడు, కెమెరామెన్.. ఇంకెవరైనా ఏదైనా చెప్పారంటే నాలోని టెన్షన్ తారాస్థాయికి చేరిపోతుంది. అయితే అది పైకి ఎవరికీ కనిపించనివ్వను. 'రేసుగుర్రం'లో శ్రుతిహాసన్‌లాగ అన్న మాట (నవ్వుతూ). నిజానికిలా ఎందుకంటే.. నేనేదైనా పాత్ర చేసేముందు నాకేమీ రాదు అనుకుంటూనే ఓ కొత్త నటిలా ఆ పాత్రలోకి అడుగుపెడతా. దాని వల్ల మరింత శ్రద్ధతో.. ప్రేక్షకుల్ని మెప్పించాలన్న కసితో ఆ పాత్రను బాగా చేయగలుగుతా. అందుకే ఆ ఒత్తిడిని ఇష్టంగా అనుభవిస్తుంటా".