డింపుల్ చీమాగా తెరపై కనిపించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను అంటోంది కియారా అడ్వాణీ. సిద్ధార్థ్ మల్హోత్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'షేర్షా'. వీర జవాన్ కెప్టెన్ విక్రమ్ బత్రా జీవిత కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విక్రమ్ ప్రియురాలు డింపుల్ చీమా పాత్రలో నటించింది కియారా. ఈ చిత్రం గురువారం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ "ఈ సినిమా కోసం డింపుల్‌ను కలవడం ఈ సినిమా ప్రయాణంలో ఎంతో కీలకమైన ఘట్టం. ఆమెను కలిశాక తెరపై పాత్రలో ఎలా ఒదిగిపోవాలో అర్థమైంది. ఈ సినిమా ట్రైలర్ చూశాకా డింపుల్ చాలా సంతోషించారని తెలిసి ఆనందపడ్డా. విక్రమ్‌తో తన ప్రేమ కథను డింపుల్ చక్కగా చెప్పారు కాబట్టే ఆమె పాత్రలో భావోద్వేగాలను పలికించగలిగా. విక్రమ్ బత్రా భౌతికంగా లేకపోయినా మానసికంగా ఇంకా ఆమెతోనే ఉన్నారు. ప్రేమ కోసం మరెవరినీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఆమె చాలా గొప్ప ప్రేమికురాలు" అని చెప్పింది కియారా.