కరోనాపై పోరుకు ఓర్పు, సహనం చాలా అవసరమని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారిని కాపాడేందుకు దేశ నాయకులు కృషి చేస్తున్న తీరును ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు. "ఇప్పుడు ఓర్పు చాలా అవసరం. గాంధీ ఓర్పుతో ఉన్నారు కాబట్టే స్వాతంత్య్రం వచ్చింది. నెల్సన్ మండేలా సహనంతో ఉన్నారు కాబట్టే దక్షిణాఫ్రికాకు స్వేచ్ఛ వచ్చింది. అంబేడ్కర్ గంగానది ఈదుకుంటూ వెళ్లి చదువుకున్నారు కాబట్టే ఆ స్థితిలో ఉన్నారు. వీళ్లంతా తమ జీవితంలో వచ్చిన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగారు కాబట్టే గొప్ప వారు అయ్యారు. వారే స్ఫూర్తి.. వీరితోపాటు నా పేరు కలుపుకొంటే బాగోదని చెప్పలేదు".
"ఒక పూట భోజనం లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు. మా నాన్న భోజనం పెట్టే వరకూ మా ఆరుగురు అన్నదమ్ములు ఎదురుచూడటమంటే ఏంటో నాకు తెలుసు. కొన్నిసార్లు కేవలం మంచినీళ్లు తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడదనే పరిస్థితి నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఎం.ఎ చేసి, లెక్చరర్ ఉద్యోగంలో చేరి.. ఈ స్థితికి వచ్చాను. అందుకే సహనంగా, ఓర్పుగా ఉండమని చెప్పే అర్హత నాకు ఉంది కాబట్టి చెబుతున్నా. పనికి వెళ్తేనే కుటుంబానికి రోజు గడిచే పరిస్థితిని నేను అనుభవించా. (భావోద్వేగంతో..) అది ఎంతో భయంకరంగా ఉంటుంది. "18 రోజులు తిండి తినకపోతే చనిపోతారంటారు. 17 రోజులు ఎవరి ముందు చేతులు చాచొద్దు. 18వ రోజు అడుక్కోరా.. లేకపోతే చచ్చిపోతావు.." అని మా నాన్న నాకు చెప్పేవారు"