"నాన్నగారితో నేను, చైతు, అఖిల్ కలిసి నటించిన 'మనం' చిత్రం ప్రివ్యూ మే 22 రాత్రి ప్రసాద్ ఐమాక్స్ లో వేశారు. అపుడు నాన్నగారితో బాగా అనుబంధం ఉన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి మే 22 తేదీనే నాన్నగారు హీరోగా నటించిన తొలి చిత్రం 'సీతారామ జననం' లో నటించడానికి ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్ కి వెళ్లారని చెప్పారు. అప్పుడే ఈ డేట్‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి నాకు తెలిసింది. మే 23న 'మనం' రిలీజ్ అయ్యింది. ఆ రోజు అందరూ ఫోన్ చేస్తూ నాకు ఈ సినిమా హిట్‌తో పాటూ నా తొలి చిత్రం 'విక్రమ్' రిలీజ్ అయ్యి 28 ఏళ్లు అయిందని చెప్పడం మొదలెట్టారు."
"నాన్నగారితో మేమంతా కలిసి నటించిన 'మనం', నేను నటించిన ఫస్ట్ పిక్చర్ 'విక్రమ్' ఒకే రోజు రిలీజ్ అవడం కూడా ప్లాన్ చేసింది కాదు. నాన్నగారు ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్‌కి వెళ్లినప్పుడు అక్కడే ఉన్న ప్రముఖ నటులు పెకేటి శివరాం గారు నాన్నగారిని ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుని ఆఫీస్‌లోకి తీసుకెళ్లడమే కాకుండా షూటింగ్ ఫస్ట్ డేన ఫస్ట్ షాట్ తీసేటప్పుడు దగ్గరుండి మేకప్ రూమ్ నుంచి షూటింగ్ స్పాట్‌కు తీసుకువచ్చారు. అదే విధంగా నా తొలి చిత్రం 'విక్రమ్'కు కూడా పేకేటి గారు ప్రత్యేకంగా వచ్చి ఫస్ట్ షాట్ తీసేటప్పుడు నన్ను మేకప్ రూమ్ నుంచి షూటింగ్ స్పాట్‌కు తీసుకొచ్చారు."