ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్‌లో చిత్రీకరణ జరపకపోయుంటే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి పండుగకు.. ప్రేక్షకుల ముందుకు వచ్చేదే కాదని నిర్మాత అనిల్ సుంకర తెలిపాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అనిల్ సుంకర మీడియాతో మాట్లాడాడు.
"ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యి.. సెన్సార్‌కు సిద్ధంగా ఉంది. అభిమానులు, కుటుంబ సభ్యులు, యువత.. ఇలా అందరికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం. 13ఏళ్ల తర్వాత విజయశాంతి గారు తిరిగి వెండితెరపై కనపించనున్నారు. ఆమె నటన అద్భుతం. మహేశ్-విజయశాంతి కాంబినేషన్‌లోని సన్నివేశాలు ఊహించని రీతిలో ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌కు యూనిట్ మొత్తం కశ్మీర్ వెళ్లాం. ఆ సమయంలో 'ఆర్టికల్ 370'ని రద్దు చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం.. భద్రతను కట్టుదిట్టం చేసింది. మా వ్యాన్‌లు అన్ని ఆగిపోయాయి. ఆర్మీ మేజర్లు చాలా సహాయం చేశారు. మన డబ్బింగ్ సినిమాల్ని వారు చూస్తుంటారట. మహేశ్ బాబు అక్కడి వారికి తెలిసి ఉండటం వల్ల మా సినిమాకు కలిసి వచ్చింది. అంత భద్రత ఎందుకు ఉందో అప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేశారు."
- అనిల్ సుంకర, టాలీవుడ్ నిర్మాత