'ప్రస్థానం' లాంటి సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు దేవా కట్టా.. ఆ తర్వాత ఆ స్థాయిలో చిత్రాలు తీయలేకపోయారు. 'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్' లాంటి సినిమాలు తీసినా సరే అవి ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టులేకపోయాయి. ఇప్పుడు 'రిపబ్లిక్'(sai tej republic) అంటూ అక్టోబరు 1న థియేటర్లలోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
"ప్రస్తుతం నా దగ్గర 6-7 కథలు ఉన్నాయి. ఇవన్నీ కొత్త పాయింట్లు. 'రిపబ్లిక్' రిలీజ్ అయిన మూడు నెలలకు కొత్త సినిమా మొదలుపెడతా. ఓటీటీకి ఆదరణ పెరుగుతున్నా సరే నేను మాత్రం థియేటర్లలో చూసేందుకు ఇష్టపడతా. రాబోయే 4-5 ఏళ్లు వరుసగా సినిమాలు చేస్తా. ప్రస్తుతం నా దగ్గర రెండు అద్భుతమైన స్టోరీలు ఉన్నాయి. ఆ రెండు కథలు సినిమాగా తీయకపోతే నా బతుక్కి అర్థం ఉండదు. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే ఓటీటీలో డైరెక్షన్ గురించి ఆలోచిస్తా" అని దేవా కట్టా చెప్పారు.