తెలుగు చిత్రాల్లో నటించినందుకు గర్వంగా ఉందని.. ముఖ్యంగా 'గబ్బర్‌సింగ్' తన జీవితాన్నే మార్చేసిందని ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపింది. ఇటీవలే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ చిత్రాల గురించే ఎక్కువగా ప్రస్తావించిందని.. దక్షిణాది చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూసిందని శ్రుతిపై అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా స్పందించిన ఈ భామ.. తాను ఒకటి చెప్తే.. తెలుగు మీడియా మరొలా చేసుకుంటోందని పేర్కొంది.
"జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి తెలుగులో ప్రచురితమైన కథానాల్లో నిజం లేదు. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. తెలుగు చిత్రాల్లో నటించినందుకు చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో చేసిన ‘గబ్బర్‌సింగ్’ నా జీవితాన్ని మార్చింది. తెలుగు సినిమా, దక్షిణాది చిత్ర పరిశ్రమ నా హృదయంలో భాగమైపోయాయి. హిందీ చిత్రాల గురించి చెప్పాను కానీ ఉత్తరాది, దక్షిణాది చిత్రాల వ్యత్యాసం గురించి ప్రస్తావించలేదు. అందరికీ అర్థమైందని భావిస్తున్నా."