థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని, కనీసం కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో యజమానులు ఉన్నారని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానిగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
"డిజిటల్ ప్లాట్‌ఫాంలు బాగా పాపులర్ అయ్యాయి. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌తో కావాల్సింది ముందుకు వస్తోంది. అందుకే ప్రజలు ఇంటి నుంచి బయటికొచ్చి థియేటర్‌లో సినిమా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. సరికొత్త సినిమాలు చూసేందుకు నెట్‌ఫ్లిక్, అమెజాన్ వంటి మాధ్యమాల్ని ఎంచుకుంటున్నారు. 'సైరా', 'సాహో'లాంటి పెద్ద సినిమాల్ని చూసేందుకు మాత్రమే థియేటర్‌కు వస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్‌కు రాకపోవడం చాలా సాధారణమైపోయింది. దీని వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. థియేటర్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయం పక్కనపెట్టండి.. నేను కనీసం కరెంటు బిల్లును కూడా చెల్లించలేకపోతున్నా."
-సురేశ్ బాబు, ప్రముఖ నిర్మాత