మాస్ మహారాజా రవితేజతో త్వరలోనే మూడు సినిమాలు చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. 'రాజా ది గ్రేట్' చిత్రానికి సీక్వెల్ కూడా అందులో ఒకటని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన 'క్రాక్' ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'క్రాక్' ప్రచార చిత్రాన్ని హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్లో అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ చిత్రంలో రవితేజ అభిమానులకు కావల్సిన మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ చిత్రం సంక్రాంతి బరిలో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాను జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు.