తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలా తొలిసారి 'జబర్దస్త్‌'లో కనిపించా : ఆది - telugu cinema news

తన పంచ్​లతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతోన్న హాస్యతరంగం హైపర్​ ఆది. అతడి కామెడీ జనాల్లోకి ఎంతగా దూసుకెళ్తుందో తెలియాలంటే సామాజిక మాధ్యమాల్లో ఈ నటుడి వీడియోలకు వచ్చే వీక్షణలు చూస్తే సరిపోతుంది. తాజాగా తన జబర్దస్త్ ప్రయాణం గురించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు ఆది. అవేంటో చూద్దాం.

hyper aadh
ఆది

By

Published : Dec 16, 2019, 5:48 AM IST

సాఫ్ట్‌వేర్‌ కుర్రోడు ఫ్రస్ట్రేటెడ్‌ 'ఫన్‌'చులతో బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త నవ్వానందాన్ని అద్దుతున్నాడు. నాలుగున్నరేళ్ల నుంచి నాన్‌ స్టాప్‌గా అలరిస్తున్నాడు. ఆది స్కిట్‌ కొడితే కాదు.. స్కిట్‌ చేస్తే చాలు ఇంచుమించు కోటి క్లిక్స్‌ యూట్యూబ్‌లో వస్తున్నాయి. ఎడతెరిపిలేని కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా ముంచెత్తుతున్న ఆ హాస్యతరంగం 'హైపర్‌ ఆది'. 'హాయ్‌' అంటూ పలకరిస్తే... ఎన్నో కబుర్లు..

మాది ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి దగ్గర పల్లామల్లి గ్రామం. అమ్మ సుబ్బమ్మ, గృహిణి. నాన్న నరసింహారావు రైతు. మేం ముగ్గురం అన్నదమ్ములం. నేను చిన్నోడిని. ఏమీలేని స్థితిని చూసినోణ్ని కాబట్టి జీవితంపై కసి పెరిగింది. నా పేరుకు ముందు అప్పటి జబర్దస్త్‌ దర్శకులు భరత్, నితిన్‌ 'హైపర్‌' అని తగిలించారు. ఇప్పుడు సామాన్యుడి నుంచి ఇతర దేశాల్లోని తెలుగువాళ్ల వరకూ నా స్కిట్స్‌ చూస్తున్నారు.

కందుకూరులోని ప్రకాశం బీటెక్‌ కాలేజీలో చదివా. చివరి బెంచీలో కూర్చుని డైలాగ్స్‌ వేసేవాణ్ని. 'అతడు' చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటుంది. అది నచ్చి అలాంటి పాత్రలే రాసుకున్నా. అవే పేరు తెచ్చాయి. జబర్దస్త్‌ స్టేజీమీద కనిపించేవారికి సమాజంలో మంచి ఆదరణ ఉంది.

ఆది

అలా జబర్దస్త్‌లోకొచ్చా..

బీటెక్‌ చదివేటప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రసంగం, అత్తారింటికి దారేది సినిమాలోని ఓ సీన్‌కి స్పూఫ్‌ చేశా. ఆ వీడియోలను లక్షలమంది చూశారు. ఆ వీడియోని 'అదిరే అభి' అన్న చూసి ఆ వీడియోకిందనే మెసేజ్‌ పెట్టారు. మెసేజ్‌ చూశాక ఫోన్‌ నంబరు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోకెళ్లి కలిశా. "నాకు స్క్రిప్టు రైటర్‌ కావాలి"అన్నాడు. స్క్రిప్టు రాయటం రాదన్నాను. తర్వాత ఎలాగైనా ఇటువైపే రావాలని నిర్ణయించుకుని.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేశా.

ఆది

సినిమాకు కథ రాస్తున్నా

గ్రామీణ జీవితం నాది. ఎన్నో కష్టాలు పడ్డా. జనాల్ని దగ్గరగా గమనించేవాణ్ని. ఎక్కువ వినటం అలవాటు. నేను రాయాలని ఇక్కడికి రాలేదు. రాయాల్సి వచ్చింది. సినిమాల ప్రభావం, గ్రామీణ నేపథ్యం, జనాలతో కలవటం వల్లనే వ్యంగ్యం ఎలా రాయాలో తెల్సింది. నా కెరీర్‌కు రచన, సహజమైన హావభావాలు, టైమింగ్‌ బలాలయ్యాయి. ఈ పంచ్‌ నేను వేద్దామనుకుంటే ఈడు వేసాడే అని చూసినోడు అనుకుంటే చాలు. అది కనెక్టవుతుంది. నాతో పాటు పరదేశీ అనే రచయిత పనిచేస్తాడు. మేం ఇద్దరం 'ఢీ' కార్యక్రమానికి రాస్తున్నాం. సినిమాలకు కామెడీ ట్రాకులు రాస్తుంటాం. త్వరలో ఓ సినిమాకి కథ రాయబోతున్నాం. ఏడాది ప్రయత్నించి తాడోపేడో తేల్చుకోవాలనుకున్నా. "ఒక్క అవకాశం ఇవ్వండన్నా" అని అదిరే అభి అన్నకు రోజూ మెసేజ్‌లు పెట్టేవాణ్ని. 2014లో ఓ రోజు "సరే వచ్చేయి స్టూడియోకి" అన్నారు. అదే.. కథానాయకుడు సునీల్‌ను రిక్షాలో లాగటం. ఆ తర్వాత స్కిట్‌లో వెనకాల కనపడేవాణ్ని. తర్వాత డైలాగు ఇచ్చారు. స్కిట్‌లో స్పాట్‌లోనే ఒకటి, రెండు డైలాగ్స్‌ అందించేవాణ్ని. కొన్నాళ్లయ్యాక స్కిట్‌ రాయమన్నారు. రెండు, మూడురోజులు కూర్చోని నా డైలాగ్స్‌ను కాగితంపై రాసుకున్నా. స్కిట్స్‌ చేశా. పేలాయి. కొన్ని టెస్ట్‌ ఎపిసోడ్స్‌ చేయించారు. ఇలా కొన్ని చేశాక.. 2016లో "నువ్వే టీమ్‌ లీడర్" అన్నారు.

రచయితగా ఉంటూ నటిస్తూ వెళ్తానంతే. రచన కొత్తగా ఉంటే చాలు.. అవకాశాలొస్తుంటాయి. మేం ఆసుపత్రికి వెళ్లినప్పుడు "మా మందులకంటే మీ కామెడీ చూసి రోగులు ఆనందంగా ఉంటారు"అని వైద్యులు చెబుతుంటారు. ఎవరైనా సరే ప్రతిభావంతులు జబర్దస్త్‌కి రావొచ్చు. అయితే టీవీలో కనపడాలనే ఉద్దేశంతో వస్తే నిలబడలేరిక్కడ. అదే జీవితంగా వస్తే కచ్చితంగా అవకాశాలొస్తాయి. అభి అన్నతో ఒకప్పుడు జబర్దస్త్‌లోకి వచ్చిన వాణ్నే కదా. అందుకే కొత్త వారిని నా జట్టులో ప్రోత్సహిస్తుంటా.

అదే మర్చిపోలేని అనుభూతి

నేను మర్చిపోలేని ప్రశంస చిరంజీవి గారిదే. ఓ సెట్‌కి వెళ్లినపుడు ఆయన కారులో వెళ్తోంటే విష్‌ చేశా. కారులోంచి దిగి "బాగా చేస్తున్నావు ఆది. నీ కామెడీ నాకిష్టం" అని మెచ్చుకున్నారు. "నీ టైమింగ్‌ మామూలుగా ఉండదు"అని వెంకటేశ్‌ ప్రశంసించారు. నేను చదివిన కాలేజీకి నేనే గెస్ట్‌గా వెళ్లా. అదో గొప్ప ఫీలింగ్‌.

చిరంజీవితో ఆది

ఇవీ చూడండి.. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో 'ధనుష్‌ 44'

ABOUT THE AUTHOR

...view details