హృతిక్ రోషన్ నటించిన కొత్త చిత్రం సూపర్ 30. ఈ సినిమా నేడు విడుదలైంది. రెండున్నరేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన హృతిక్ ఆకట్టుకుంటున్నాడు. గణిత అధ్యాపకుడు ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ అద్భుతంగా నటించాడంటూ బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
కథలోకి వెళ్తే...
పోస్ట్ మ్యాన్ కుమారుడైన ఆనంద్ (హృతిక్ రోషన్) గణితంలో నిష్ణాతుడు. అతడికి కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి అడ్మిషన్ వస్తుంది. అయితే పేదరికం కారణంగా ఫీజు కట్టలేక ఆ అవకాశాన్ని వదులుకుంటాడు ఆనంద్. ఐఐటీ కోచింగ్ సెంటర్‌ను నిర్వహించే లాలాజీ(ఆదిత్య శ్రీవాస్తవ) ఆనంద్‌ను గణిత అధ్యాపకుడిగా నియమించుకుంటాడు. ఆనంద్ తన నైపుణ్యంతో విద్యార్థులను మేటిగా తయారు చేస్తాడు. తన ప్రతిభ డబ్బున్న వారికి ఉపకరిస్తుందని తెలుసుకున్న ఆనంద్... పేద విద్యార్థుల కోసమే పనిచేయాలని భావిస్తాడు. అర్హత ఉండి డబ్బులేని పేదవారి కోసం ఉచిత శిక్షణా సంస్థను ప్రారంభిస్తాడు. ఈ కోచింగ్ సెంటర్ నడిపించేందుకు ఆనంద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మెప్పించిన హృతిక్..
ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా బిహారీ మాండలికంలో అతడు చెప్పే సంభాషణలు ఆకట్టుకున్నాయి. విద్యాశాఖ మంత్రిగా పంకజ్ త్రిపాఠి, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిగా ఆదిత్య శ్రీవాస్తవ తమ నటనతో మెప్పించారు.