కంగనా రనౌత్ నటించిన 'మెంటల్ హై క్యా', హృతిక్ రోషన్ 'సూపర్ 30' సినిమాలు ఒకేరోజున (జూలై 26) థియేటర్లలో సందడి చేయనున్నాయి. హృతిక్ సినిమా ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావాల్సినా దర్శకుడు వికాశ్ బాల్‌పై లైంగిక ఆరోపణలు రావడం వల్ల సినిమా వాయిదా పడింది. అయితే జూలై 26వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
తాజాగా కంగనా నటించిన 'మెంటల్ హై క్యా' చిత్రం ఆరోజే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ వెల్లడించారు. ఈ సినిమా జూన్ 21న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కాని డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ నిపుణుల సూచన మేరకు జూలై 26కి విడుదల తేదీని మార్చారు.
ఒకే రోజు విడుదలకానున్న కంగనా, హృతిక్ చిత్రాలు
" చిత్ర విడుదల తేదీని జూలై 26వ తేదీకి మర్చాం. వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు వేరే సినిమా విడుదలవుతుందని తెలుసు. కాని ఆ చిత్రంతో మాకెలాంటి ఇబ్బంది లేదని తెలుసుకున్నాకే మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం."
-- ఏక్తా కపూర్, మెంటల్ హై క్యా చిత్ర నిర్మాత
హృతిక్ , కంగనా విభేదాలను క్యాష్ చేసుకోవడానికే సినిమా విడుదల తేదీ మార్చారని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు ఏక్తా కపూర్.
'మెంటల్ హై క్యా' చిత్రానికి ప్రకాశ్ కోవెలమూడి దర్శకుడు. రాజ్‌కుమార్ రావ్ కీలక పాత్ర పోషించారు. కంగనా, రాజ్ జంటగా నటించిన రెండో చిత్రమిది. చివరిగా వచ్చిన కంగనా 'మణికర్ణిక' ఘనవిజయం సాధించింది. హృతిక్ సినిమా విడుదల ఆగస్టు 9కి వాయిదా వేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటనేమి రాలేదు.