మంచి అవకాశం వచ్చినపుడు వదులుకుని ఆ తర్వాత బాధపడటం అన్ని రంగాల వ్యక్తుల జీవితంలోనే జరిగేదే! ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంటేనే డబ్బుతోపాటు అంతకు మించిన పేరు తీసుకొస్తుంది. తరతరాలు నిలిచే పాత్ర అయితే నటీనటులకు కావాల్సిందేముంటుంది? సహజనటి జయసుధకు గతంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. అది ఎప్పుడంటే?
'సాగరసంగమం'లో జయసుధ నటించాల్సింది.. కానీ! - కమల్ జయసుధ వార్తలు
'సాగరసంగమం'లో తొలుత నటించేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్న ప్రముఖ నటి జయసుధ.. కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను వదులుకుంది. దీంతో అదే పాత్రలో నటించిన జయప్రద.. అభిమానుల మనసులో చోటు దక్కించుకుంది.
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్.. కమల్ హాసన్, జయప్రద జంటగా తీసిన చిత్రం 'సాగర సంగమం'. నృత్యం నేపథ్య కథతో దీనిని రూపొందించారు. చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంది. తెలుగు సినిమా ఉన్నంతకాలం చెప్పుకునే, చెప్పుకోదగిన కళాఖండం 'సాగర సంగమం'. ఇందులో బాలకృష్ణగా కమల్, మాధవిగా జయప్రద నటన అత్యద్భుతం. ఈ రెండు పాత్రలు టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. అందుకే అధికశాతం నటులు మీకు నచ్చిన సినిమా ఏది అంటే? టక్కున 'సాగర సంగమం' అని.. అవకాశం వస్తే పాత చిత్రాల్లోని ఏ పాత్రను పోషిస్తున్నారు అనగానే వెంటనే కమల్, జయప్రద అని చెప్తుంటారు.
అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ పాత్ర కోసం సహజనటి జయసుధను సంప్రదించారు. కథ విని అంతా ఓకే చెప్పేసి, అడ్వాన్స్ కూడా ఈమె తీసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జయసుధ ఇందులో నటించలేకపోయారు. దీంతో ఆ అవకాశం కాస్త జయప్రదను వరించింది. తద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించారు.