ప్రముఖ హాలీవుడ్ నటి, బుల్లితెర స్టార్ కిమ్ కర్దాషియాన్‌కు ఫొటోగ్రాఫర్ సయీద్ బోల్డెన్ షాకిచ్చాడు. అనుమతి లేకుండా అతడు తీసిన చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నందుకు దావా వేశాడు. అయితే ఆ మొత్తం ఎంతన్నది తెలపకపోయినా.. ఈ ఫొటో ద్వారా తనకు జరిగిన నష్టాన్ని ఆమె చెల్లించేలా చూడాలని బ్రోక్లెన్ ఫెడరల్ కోర్టును కోరాడు.
ఏం జరిగిందంటే..?
2018 జూన్లో కిమ్ కర్దాషియాన్, తన భర్త కేన్ వెస్ట్తో కలిసి ఓ ప్రైవేట్ వేడుకకు హాజరైంది. ఇందులో భాగంగా సయీద్ బోల్డెన్ అనే ఫొటోగ్రాఫర్ వారిద్దరి చిత్రాన్ని బంధించాడు. దాన్ని ఓ ఆల్బమ్కు వాడాలని అనుకున్నాడు. అయితే అదే చిత్రాన్ని అనుమతి లేకుండా అదే ఏడాది అక్టోబర్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది కిమ్. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల నుంచి తొలిగించాలని కోరినా.. పట్టించుకోలేదట. ఈ కారణంగా తాజాగా కిమ్పై ఫిర్యాదు చేస్తూ.. దావా చెల్లించాలని బ్రోక్లెన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడీ ఫొటోగ్రాఫర్.