Willsmith Oscar Award: 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన కూడా జరిగింది. తన భార్యపై జోక్ వేయడం వల్ల స్టార్ హీరో విల్‌స్మిత్.. స్టేజ్‌పైనే కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. ఆపై క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో విల్‌స్మిత్‌కు ఉత్తమ అవార్డు దక్కింది.
అయితే ఇప్పుడా అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అకాడమీ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతడి ఆస్కార్‌ను వెనక్కి తీసుకోని గట్టి చర్యలు చేపట్టాలని కొందరు గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. "హింస ఏ రూపంలో ఉన్న అకాడమీ సహించదు. 94వ అకాడమీ అవార్డుల వేడుక జరగడం, విజేతలకు గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాం" అని ట్వీట్ చేసింది. అయితే పురస్కారాన్ని వెనక్కి తీసుకునే వ్యవహారంపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయం కూడా చెప్పలేదు.