మెగావారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహ వేడుకకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం ఆమె పెళ్లి కుమార్తెగా ముస్తాబయింది. ఈ సందర్భంగా 32 ఏళ్ల క్రితం తన తల్లి నిశ్చితార్థంలో కట్టుకున్న చీరను కట్టుకొని కుందనపు బొమ్మలా మెరిసిపోయింది నిహారిక.
ఆకట్టుకుంటోన్న ఆ సెల్ఫీ..
ఇలా పెళ్లి పనుల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా తన వారందరితో ఫొటోలు దిగి అభిమానులతో పంచుకుంటోంది నిహారిక. అందులో భాగంగా పెదనాన్న చిరంజీవితో.. అక్కలతో(చిరంజీవి కూతుళ్లు) దిగిన ఫొటోలను పంచుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫొటో మాత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పెదనాన్నతో కలిసి నిహారిక సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోను నాగబాబు తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పంచుకున్నారు.
'ఆయన ప్రేమ.. సమయం, వయసు అనే సరిహద్దులను దాటింది. ఆయన చిరునవ్వు ప్రతిక్షణాన్ని వేడుకలా మారుస్తుంది' అంటూ ఆ ఫొటోను పోస్టు చేశారు. ఈ నెల 9న చైతన్య జొన్నగడ్డ, నిహారిక కొణిదెల వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గల ఉదయ్‌విలాస్ ఈ శుభకార్యానికి వేదిక కాబోతోంది. ఆగస్టులోనే వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది.
ఇదీ చదవండి:జర్నలిస్టు వైద్యం కోసం మెగాస్టార్ సాయం