Hey Sinamika Review: చిత్రం: హే సినామిక; నటీనటులు: దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరి, కాజల్ అగర్వాల్ తదితరులు; సంగీతం:గోవింద్ వసంత్; ఛాయాగ్రహణం: ప్రీత జయరామన్; దర్శకత్వం: బృందా; నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్; విడుదల తేదీ: 03-03-2022.
కొత్తదనం నిండిన కథలతో అలరిస్తుంటారు కథానాయకుడు దుల్కర్ సల్మాన్. అదే ఆయన్ను మలయాళంతో పాటు అన్ని చిత్రసీమల ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇటీవలే 'కురుప్'తో సినీ ప్రియులకు వినోదం పంచిన ఆయన.. ఇప్పుడు 'హే సినామిక'తో బాక్సాఫీస్ ముందుకొచ్చారు. ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా మాస్టర్ తెరకెక్కించిన తొలి చిత్రమిది. విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన సినిమా కావడం.. దుల్కర్, అదితిరావ్ హైదరి, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం కలిసి నటించడంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఇందుకు తగ్గట్లుగానే ప్రచార చిత్రాలు ఆహ్లాదకరంగా.. మనసులకు హత్తుకునేలా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ అంచనాలను సినామిక అందుకుందా? ఈ సినిమాతో దుల్కర్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారా? తెలుసుకుందాం పదండి..
కథేంటంటే:ఆర్యన్ (దుల్కర్ సల్మాన్), మౌనలది (అదితిరావు హైదరి) తొలి చూపు ప్రేమ. ఆ ప్రేమను వెంటనే పెళ్లి పీటలెక్కించి దంపతులుగా మారతారు. కానీ, పెళ్లైన రెండేళ్లకు పరిస్థితులన్నీ తలకిందులవుతాయి. మౌనకు ఆర్యన్‌పై ఉన్న ప్రేమ తగ్గి.. అతనంటే విసుగు, చిరాకు మొదలవుతుంది. దానికి కారణం ఆర్యన్ ఎక్కువగా మాట్లాడుతుండటం, అతను చేసి పెట్టే వంటలు. ఈ కారణాల వల్లే ఆమె విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం తన ఇంటి పక్కనే ఉంటున్న మలర్ (కాజల్) అనే సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తుంది. ఎలాగైనా తన అందచందాలతో ఆర్యన్‌ను ప్రేమలో పడేయమని కోరుతుంది. అలా పడేస్తే.. దాన్నే కారణంగా చూపించి అతని నుంచి విడాకులు తీసుకుంటానని చెబుతుంది. తాను చెప్పినట్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మౌన చెప్పిన పనికి మలర్ అంగీకరిస్తుంది. ఆర్యన్‌కు దగ్గరై.. అతన్ని తన ప్రేమలోకి దింపే ప్రయత్నం చేస్తుంది. మరి ఆతర్వాత ఏమైంది? మౌన కోరుకున్నట్లుగా ఆర్యన్.. మలర్ ప్రేమవలలో చిక్కుకున్నాడా? అతని నుంచి ఆమె విడాకులు తీసుకుందా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే:నేపథ్యాలలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు కానీ, ప్రేమకథలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిని తమదైన శైలిలో తెరపై కొత్తగా ఎలా ఆవిష్కరిస్తారన్న దానిపైనే ఆ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. సినామిక తరహా చిత్రాలు కూడా తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే ఇందులో కథని హీరోయిన్ కోణం నుంచి నడిపిన విధానం బాగుంది. అతిగా మాట్లాడుతూ.. బొమ్మరిల్లు డాడీకి ప్రతిరూపంలా ప్రేమతో వంటలు చేసి పెట్టి చంపేసే భర్త. ఆ అతి ప్రేమ వల్ల తన ప్రశాంతత దూరమవుతుందనుకునే భార్య. ఈ ఇద్దరి మధ్య జరిగే కథే ఈ చిత్రం. దీన్ని వినోదభరితంగా నడిపిస్తూనే.. భావోద్వేగభరితంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు బృందా. కానీ, సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఓ ప్రహసనంలాగే సాగుతుంది. దుల్కర్, అదితిల పరిచయ సన్నివేశాలతో చిత్రం సాదాసీదాగా మొదలవుతుంది. ఆ వెంటనే ఇద్దరూ ప్రేమలో పడటం.. ఓ పాట పూర్తయ్యే సరికి ఇద్దరూ దంపతులుగా మారిపోవడం వంటి సన్నివేశాలతో కథ చకచకా పరుగులు పెడుతుంది. కానీ, అసలు దుల్కర్, అదితిల మధ్య ప్రేమ చిగురించడానికి కారణమేంటన్నది ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఫలితంగా వారి ప్రేమకథతో ప్రేక్షకులు ఆరంభంలోనే డిస్‌కనెక్ట్ అయిపోతారు.
తన భర్త అతి వాగుడు, వంటల కారణంగా మౌన అతని నుంచి విడిపోవాలనుకోవడం.. ఈ క్రమంలో తన సహచర ఉద్యోగుల సలహాలతో ఆమె చేసే ప్రయత్నాలు అక్కడక్కడా కాస్త నవ్వులు పూయిస్తాయి. అయితే ఆ తర్వాత సాగే కథనమంతా ప్రేక్షకుల సహనానికి పరీక్షలాగే ఉంటుంది. మలర్ పాత్ర కథలోకి ప్రవేశించాకే సినిమాకి మళ్లీ కాస్త ఊపొస్తుంది. విరామానికి ముందు ఆర్యన్‌కు మలర్ దగ్గరవడంతో ద్వితియార్థంలో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి మొదలవుతుంది. మలర్.. ఆర్యన్‌లు కలిశాక వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాల్లో ఆర్యన్ పలికే సంభాషణలు.. అతనికి, మౌన, మలర్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి.
ఎవరెలా చేశారంటే: ఆర్యన్ పాత్రలో దుల్కర్ ఒదిగిపోయారు. ఆయనకు అదితికి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. ద్వితీయార్థంలో కాజల్‌కు ఆయనకు మధ్య వచ్చే లవ్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. మౌనగా అదితి కనిపించిన విధానం బాగుంది. మలర్‌గా కాజల్ పరిధి మేరకు నటించింది. ప్రధమార్థంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత దొరకలేదు. తెరపై ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. కథలో కొత్తదనమున్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో బృందా మాస్టర్ పూర్తిగా విఫలమయ్యారు. డ్యాన్సుల విషయంలో మాత్రం తన ప్రతిభను ఆకట్టుకునేలా చూపించారు. పతాక సన్నివేశాల్ని హృద్యంగా ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. గోవింద్ వసంత సంగీతం, ప్రీత జయరామన్ ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు:
+ దుల్కర్, కాజల్, అదితీల నటన