ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా గట్టిగా పదేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది ప్రస్తుతం దశాబ్దాలకు పైగా సినీపరిశ్రమల్లో పాతుకుపోతున్నారు కొందరు కథానాయికలు. అలానే వయసుతో సంబంధం లేకుండా అటు తండ్రి, ఇటు కొడుకు సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకుల సినిమాల్లో హీరోయిన్గా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని సాధ్యం చేసి చూపించారు కొందరు ముద్దుగుమ్మలు. వారి గురించే ఈ కథనం.
మెగా హీరోలతో..
లక్ష్మీ కల్యాణం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో'మగధీర'లో నటించి స్టార్ హోదా తెచ్చుకుంది. ఆ తర్వాత చరణ్‌తో 'నాయక్', 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాల్లోనూ ఆడిపాడింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెం.150'లో హీరోయిన్గా చేసి అలరించింది. దీంతో తండ్రీకొడుకులైన చిరు, చరణ్‌ల సినిమాల్లో కథానాయికగా చేసిన ఘనతను కాజల్ సొంతం చేసుకుంది.
తన విభిన్న నటనతో పాన్-ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది తమన్నా. 2005లో వచ్చిన 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. రామ్ చరణ్ సరసన 'రచ్చ'లో నటించి, ఆ తర్వాత చిరు 'సైరా'లోనూ కీలక పాత్ర పోషించింది. కాజల్ తర్వాత చిరు, చెర్రీలతో కలిసి నటించిన ఘనత తమన్నాదే.