"కొత్త దారుల్లో నడవాలి.. సవాల్ విసిరే పాత్రలతో సవారీ చేయాలి.. నటనలో సరికొత్త లోతులు చూడాలి. లోలోన దాగిన ప్రతిభను నిత్యనూతనంగా ప్రేక్షకులకు కొసరి కొసరి వడ్డించాలి.."
వెండితెరపై అడుగుపెట్టే ప్రతి కథానాయిక ఆశలు.. ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఇదంత ఆషామాషీ వ్యవహారం కాదన్నది జగమెరిగిన సత్యం. వరుస విజయాలతో దూసుకెళ్లాలి. సోలోగా సినీప్రియుల్ని థియేటర్‌కి రప్పించగల సత్తా ఉందని నిర్మాతల్లో భరోసా కలిగించాలి. అప్పుడే ఆశించిన పాత్రల్ని అందుకోగలిగేది. కొత్తదనం నిండిన పాత్రలతో మురిపించగలిగేది. ఇప్పుడు తెలుగు తెరపై అగ్ర నాయికలుగా జోరు చూపిస్తున్న తమన్నా.. అనుష్క.. సమంత..లాంటి వారంతా ఈ పరీక్షల్ని దాటొచ్చి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న వారే. అందుకే ఇప్పుడు వీరంతా ప్రయోగాత్మక పాత్రలకు చిరునామాగా నిలుస్తూ.. సినీప్రియులను సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది అలా సరికొత్త పాత్రలతో పలకరించబోతున్న ఆ నాయికలెవరో చూసేద్దాం..
ప్రతినాయికా.. పౌరాణిక ప్రేమిక
అందం..అభినయం..అదృష్టం..సమపాళ్లలో కలిగిన ముద్దుగుమ్మ సమంత. వెండితెరపై ఆమె తొలి ఆరేళ్ల ప్రయాణం ఒకెత్తయితే.. ఆ తర్వాత మరో ఎత్తు. సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటిని వందశాతం తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేయనున్న 'శాకుంతలం' చిత్రం ఆ కోవకు చెందినదే. మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమకథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పుడీ పౌరాణిక ప్రేమ కావ్యం కోసమే సామ్ తొలిసారి గుర్రపు సవారీ నేర్చుకోనుంది. ఇక త్వరలో రాబోతున్న 'ది ఫ్యామిలీమెన్ 2' వెబ్‌సిరీస్‌లోనూ సామ్ ఓ సాహసోపేత పాత్రలోనే కనిపించనుంది. ఇందులో ఆమె ప్రతినాయక ఛాయలున్న పాత్రలో యాక్షన్ సీక్వెన్స్‌ని డూప్ లేకుండా స్వయంగా చేసినట్లు సమాచారం.
శ్వేత సుందరికి తొలి సవాల్
గ్లామర్ తార అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుంటుంది తమన్నా. ఓవైపు కమర్షియల్ నాయికగా మురిపిస్తూనే.. నటనా ప్రాధాన్య పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడీ క్రమంలోనే 'అంధాధూన్' రీమేక్‌తో తనలోని నటికి అసలు సిసలు పరీక్ష పెట్టుకోనుంది తమన్నా. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. హిందీలో 'అంధాధూన్'కి ప్రధాన ఆకర్షణగా నిలిచిన టబు పోషించిన పాత్రనే తెలుగులో తమన్నా చేస్తోంది. ప్రతినాయక ఛాయలున్న పాత్ర ఇది. ఒకరకంగా నటిగా తమన్నాకి సవాల్ విసిరే పాత్ర. ఆమె త్వరలో 'సీటీమార్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులోనూ ఆమె సాహసోపేతమైన పాత్రలోనే నటించింది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ పాత్ర కోసం ఆమె తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పిందట.
థ్రిల్లింగ్ ప్రతినాయిక..
తొలి అడుగుల్లోనే 'మహానటి' లాంటి అపురూప చిత్రం చేసి.. జాతీయ స్థాయిలో మెరిసింది కీర్తి సురేష్. ఇప్పుడా గుర్తింపును కాపాడుకుంటూనే విలక్షణమైన కథలతో ప్రయాణం సాగిస్తోంది. ఈ క్రమంలోనే 'సాని కాయిదం' అనే ఓ వైవిధ్యభరిత చిత్రానికి పచ్చజెండా ఊపింది. అరుణ్ మతేశ్వరన్ దర్శకుడు. ఈ చిత్రం కోసం తొలిసారి డీగ్లామర్ పాత్రలో నటిస్తోంది కీర్తి. ఇది ఒకరకంగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రని సమాచారం.
చిత్తూరు పల్లె అందం
అవకాశాల పరంగానూ.. విజయాలు అందుకోవడంలోనూ జోరు చూపిస్తున్న నాయిక రష్మిక. కథ.. కథనాలు నచ్చాలే కానీ, పాత్ర కోసం ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధమైపోతుంటుందీ భామ. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' కోసం అలాంటి ప్రయోగమే చేస్తోందీ ముద్దుగుమ్మ. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఇందులో ఆమె ఓ పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామర్ పాత్రలో కనిపిస్తూనే.. చిత్తూరు యాసలో సంభాషణలు పలకబోతుందట. ఆమె ఇప్పటికే ఈ పాత్ర కోసం చిత్తూరు యాసలో శిక్షణ కూడా తీసుకుంది.