సినిమా అంటే గుర్తొచ్చేది హీరోనే. ఎందుకంటే అతడు సాహసాలు చేస్తాడు. రొమాన్స్ పండిస్తాడు. హాస్యంతో నవ్విస్తాడు. విలన్ను మట్టుబెడతాడు. ఇలా ఎన్నో రకాల పనులు చేసి మనల్ని అలరిస్తాడు. ఇప్పటివరకు వచ్చిన వాటిలో చాలా తెలుగు చిత్రాలు ఈ పంథాలోనే ఉన్నాయి. కానీ ఇలాంటి వాటిలోనూ కొందరు హీరోయిన్లు మెప్పించారు. కథానాయకుడికి మేం ఏం తక్కువ కాదని నిరూపించుకున్నారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే ఇప్పటికి వారి పేరు ఎక్కడ చూసినా, విన్నా.. వారు అదరగొట్టిన ఆ పాత్రే గుర్తొస్తుంది. అలా కొన్ని పాత్రలతో అభిమానుల మదిలో స్థానం సంపాదించుకున్న కొందరు హీరోయిన్లు వీరు. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిపై ప్రత్యేక కథనం.
1. శ్రీదేవి-జగదేకవీరుడు అతిలోక సుందరి
'బ్యూటీ క్వీన్' శ్రీదేవి గురించి ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ 80, 90వ దశకాల్లో ఆమె నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకాదరణ అందుకున్నాయి. అయితే వీటిన్నింటిలోనూ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ప్రత్యేకం. ఇందులో ఆమె ఇంద్రజ అనే దేవకన్యగా అదరగొట్టింది. మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి నటించి, మెప్పించింది.
2. గిరిజ- గీతాంజలి
దర్శకుడు మణిరత్నం తీసిన 'గీతాంజలి'.. టాలీవుడ్లో గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో ఒకటి. ఇందులో హీరోయిన్గా గిరిజ నటించింది, కాదు కాదు అద్భుతంగా మెప్పించింది అనే చెప్పాలి. ఇప్పటికీ ఈ చిత్రం అంటే గుర్తొచ్చే పేరు గిరిజనే.
3. ఆమని-శుభలగ్నం
పెళ్లి నేపథ్యంలో వచ్చిన 'శుభలగ్నం'లో ఆమని ఓ హీరోయిన్గా నటించింది. డబ్బుల కోసం భర్త జగపతిబాబును అమ్ముకునే భార్యగా మెప్పించే ప్రదర్శన చేసింది.
4.జెనీలియా-బొమ్మరిల్లు
'తల తల గుద్దుకుంటే కొమ్ములొస్తాయి తెలుసా' అంటూ 'బొమ్మరిల్లు' సినిమాలో హాసిని చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆమె సొంత పేరు జెనీలియా అయినా, హాసినిగానే ఇప్పటికీ గుర్తుండిపోయింది.
5. స్వాతి-అష్టాచమ్మా
'మహేశ్.. ఆ పేరులో వైబ్రేషన్ ఉంది' అంటూ హీరోయిన్ స్వాతి చేసిన హంగామా చూడాలంటే 'అష్టాచమ్మా' చూడాల్సిందే. ఎందుకంటే ఈ హీరోయిన్ లావణ్య పాత్రలో నటించింది అనడం కంటే జీవించేసిందనే చెప్పాలి. కథానాయికగా ఈమెకు ఇదే తొలి సినిమా. తన కెరీర్లో ఈ స్థాయిలో హిట్ అయిన చిత్రం మరొకటి లేదోమో!