తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సెకండ్​ ఇన్నింగ్స్​కు సిద్ధమైన తారలు! - శియా గౌతమ్​

ఒకానొక సమయంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్​ నటీమణులు.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు. అలా వెండితెరకు దూరమైన కొంతమంది తారలు సినిమాల్లోకి మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. భాగ్యశ్రీ నుంచి షాలినీ అజిత్​ వరకు ఎంతోమంది నటీమణులు తెరపై మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. అయితే సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభిస్తోన్న ఆ తారలెవరో తెలుసా?

heroines re-entry in tollywood
సినిమాల్లో సెకండ్​ ఇన్నింగ్స్​కు సిద్ధమైన తారలు!

By

Published : Mar 18, 2021, 1:57 PM IST

సుస్మితాసేన్‌, రాశీ.. ఇలా చెప్పుకుంటూ వెళితే పలువురు కథానాయికలు రీఎంట్రీలోనూ దూసుకెళ్తున్నారు. ఒకానొక సమయంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు కుటుంబబాధ్యతల వల్ల రంగుల ప్రపంచానికి దూరమయ్యారు. అలా, వెండితెరకు దూరమైన కొంతమంది నటీమణులు ఇప్పుడు తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 'గ్యాప్‌ ఎంత అన్నది కాదు.. రీఎంట్రీతో మెప్పించామా లేదా' అన్నట్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తోన్న కథానాయికలపై ఓ లుక్కేయండి..!

దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీ

భాగ్యశ్రీ

'మైనే ప్యార్‌ కియా'తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి భాగ్యశ్రీ. ఈ ప్రేమకథా చిత్రం విజయం తర్వాత ఆమె పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించారు. వివాహం అనంతరం కుటుంబ బాధ్యతల్లో భాగంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న భాగ్యశ్రీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌'లో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రం జులై 30న విడుదల కానుంది.

'వైదేహి' వచ్చేస్తోంది..!

రాధేశ్యామ్ దర్శకుడితో సిమ్రన్​ కౌర్​

'పోటుగాడు'లో వైదేహిగా నటించిన ముంబయి ముద్దుగుమ్మ సిమ్రన్‌ కౌర్‌ ముండి. మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో, అవకాశాలు రాకపోవడం వల్ల సిమ్రన్‌ టాలీవుడ్‌కు దూరమయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ బ్యూటీ తెలుగు తెరపై మెరవనున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తోన్న 'రాధేశ్యామ్‌'లో ఆమె ఓ పాత్రలో కనిపించనున్నారు.

'ఉత్తమ నటి' వస్తున్నారు..!

అర్చన

'నిరీక్షణ', 'లేడీస్‌ టైలర్‌' లాంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్నారు అలనాటి నటి అర్చన. ఉత్తమనటిగా వరుసగా రెండుసార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఆమె కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. పాతికేళ్ల తర్వాత ఇటీవల తెరముందుకు వచ్చిన ఆమె తెలుగులో ఓ సినిమా చేస్తున్నట్లు 'ఆలీతో సరదాగా' ఇంటర్వ్యూలో ప్రకటించారు. అయితే, ఆ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

'మహీ' మెరిపించేనా..!

అన్షూ అంబానీ

'మన్మథుడు'లో మహేశ్వరిగా కనిపించి తెలుగు కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన నటి అన్షూ అంబానీ. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఆమెకు ఎంతో క్రేజ్‌ తెచ్చిపెట్టింది. 2004లో వచ్చిన 'మిస్సమ్మ' తర్వాత వెండితెరపై ఆమె జాడ లేదు. దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షూ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. తారక్‌-త్రివిక్రమ్‌ కాంబోలో రానున్న సినిమాలో ఆమె కీ రోల్‌ పోషిస్తున్నట్లు సమాచారం.

'సఖి' భామ రానుందా..!

షాలినీ అజిత్​

'సఖి'తో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి షాలినీ. కెరీర్‌లో రాణిస్తున్న తరుణంలో అజిత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె 2001లో నటనకు స్వస్తి చెప్పారు. కుటుంబబాధ్యతలతో బిజీగా ఉన్న షాలినీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న 'పొన్నియిన్‌ సెల్వన్‌'లో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

రీఎంట్రీకి ఓకే అంటోన్న వాసుకి..!

వాసుకి

'తొలిప్రేమ'లో పవన్‌కల్యాణ్‌ సోదరిగా నటించి మెప్పించారు నటి వాసుకి. అదే చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆనంద్‌ సాయిని వివాహం చేసుకున్న ఆమె ఎన్నో సంవత్సరాల క్రితం కెరీర్‌కు ఫుల్‌స్టాఫ్‌ పెట్టారు. చాలాకాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసుకి.. అవకాశాలు వస్తే తప్పకుండా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తానని చెప్పారు.

'నేనింతే' నటి రానుందా?

శియాగౌతమ్

'నేనింతే'తో కథానాయికగా తెరంగేట్రం చేసిన నటి శియాగౌతమ్‌. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. దాంతో ఆమె రెండేళ్ల తర్వాత 'వేదం'లో నటించి మెప్పించారు. ఆ తర్వాత 2016లో వచ్చిన 'ఏడు ప్రేమ కథలు'లో నటించి.. వెండితెరకు దూరమయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ నటి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్‌ కథానాయకుడిగా రానున్న 'పక్కా కమర్షియల్‌'లో ఆమె నటించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

ఇదీ చూడండి:ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు ఎన్టీఆర్​​.. 'పాగల్​' హీరోయిన్​ ఫస్ట్​లుక్​

ABOUT THE AUTHOR

...view details