తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ సైలెంట్.. బాగా ఇబ్బంది పెట్టేదాన్ని: రష్మిక - అనిల్ రావిపూడి-మహేశ్​బాబు

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక.. చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంది. తన తర్వాతి ప్రాజెక్టులు గురించి చెప్పింది.

మహేశ్​ సైలెంట్.. బాగా ఇబ్బంది పెట్టేదాన్ని: రష్మిక
మహేశ్​బాబు-రష్మిక

By

Published : Jan 6, 2020, 9:03 PM IST

టాలీవుడ్​లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక. 'ఛలో', 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌' వంటి సినిమాలతో యువతను ఆకట్టుకున్న ఈ భామ నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సూపర్​స్టార్ మహేశ్‌బాబు హీరో. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రష్మిక.. మీడియాతో మాట్లాడింది. తన పాత్ర విశేషాలను పంచుకుంది.

హీరోయిన్ రష్మిక

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

మీరు ట్రైలర్‌ చూసుంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది. హీరో వెంటపడి బాగా అల్లరి చేసే పాత్ర, చాలా సరదాగా ఉంటుంది. ఈ సినిమాతో పూర్తి స్థాయిలో కామెడీ చేసే అవకాశం నాకు దక్కింది.

సెట్‌లోనూ బాగా అల్లరి చేసేవారా?

సాధారణంగా సెట్‌లో సీరియస్‌గా ఉండటం నాకు నచ్చదు. అల్లరి చేయడం అంటేనే ఇష్టం. అందుకని సెట్‌లో అందరితో సరదాగా ఉండేదాన్ని.

మహేశ్‌లో నచ్చిన గుణం ఏంటి?

సెట్‌లో మహేశ్‌ చాలా మౌనంగా ఉండేవారు. నేనెళ్లి ఆయన్ని డిస్ట్రబ్‌ చేసేదాన్ని.

సరిలేరు నీకెవ్వరులో హీరో మహేశ్​బాబు

ట్రైలర్‌ చూస్తుంటే మీ పాత్ర విభిన్నంగా ఉన్నట్లుంది?

అవునండీ. 'మీకు అర్థమవుతుందా, ఐయామ్ ఇంప్రెస్డ్‌' లాంటి మేనరిజమ్స్‌ సినిమా అంతా ఉంటాయి. సంగీతతో కలిసి చేసే 'నెవ్వర్‌ బిఫోర్‌, ఎవ్వర్‌ ఆఫ్టర్‌'లాంటి మేనరిజమ్స్‌ ఆడియన్స్‌కు బాగా ఎక్కేస్తాయి.

దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రతి సీన్‌లో నటించి, చూపించేవారా?

ఆయనకి నేను ఒక్కటే చెప్పా. 'సార్‌ మీరు చేయండి. నేను కాపీ చేస్తా. ఐయాం వెరీ గుడ్‌ కాపీ క్యాట్‌' అన్నా. ఆయన చేసేదాన్ని స్కాన్‌ చేసి, నా స్టైల్‌లో ఫాలో అయ్యా.

హీరోయిన్ రష్మిక

ప్రీ రిలీజ్‌లో విజయశాంతితో బాగా కలిసిపోయినట్లు కనిపించారు. ఇంత తక్కువ టైమ్‌లో ఆమెతో అంత బంధం ఎలా ఏర్పడింది?

కేరళ షెడ్యూల్‌లో నేను మొదటిసారి ఆమెను కలిశా. నాకు ఇంతకుముందే మేడమ్‌ గురించి తెలుసు. లేడీ అమితాబ్‌లాంటి ఆమెతో కలిసి మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది. తర్వాత సెట్‌లో ఆమె ఎనర్జీ చూసి ఫిదా అయ్యా. వరుసగా రెండు రోజులు ఆమెతోనే ఉన్నా. డ్యాన్స్‌, నటనకు సంబంధించిన కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నా.

షూటింగ్‌లో మహేశ్‌ మీ సినిమాల గురించి మాట్లాడేవారా?

మహేశ్‌ దాదాపు అన్ని సినిమాలు చూస్తారు. నేను నటించిన 'ఛలో', 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాలు చూశానని చెప్పారు.

సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్స్‌కు అంతగా ప్రాధాన్యత ఉండదు? కానీ ఇందులో మీ పాత్ర బలంగా ఉంది కదా..

ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. సినిమాలో నా పాత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తుందనే దానికి బలమైన కారణం ఉంటుంది.

మీరు ఈ సినిమాకు సంతకం చేయడానికి కారణం?

అనిల్‌ సర్‌ ఈ స్క్రిప్టు వివరించినప్పుడే నా పాత్ర, సంగీత పాత్ర ఎలా ఉంటుందో చూపించారు. అప్పుడే నాకు బాగా నచ్చింది. అందులోనూ మంచి ఫీల్‌ ఉంది. అలాగే మహేశ్‌, విజయశాంతితో కలిసి నటించడం బోనస్‌.

సరిలేరు నీకెవ్వరులో హీరో మహేశ్​బాబు

రైలు ఎపిసోడ్‌ గురించి చెప్పండి?

నేను డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ఆ సన్నివేశాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయా. షూటింగ్‌ చేస్తున్నప్పుడూ మొత్తం చిత్ర బృందం బాగా నవ్వుకున్నాం. రేపు ప్రేక్షకులూ ఆ కామెడీ ట్రాక్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తారు.

మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌?

ఆ పాట చిత్రీకరణ రోజు నాకు డ్యాన్స్‌ వచ్చో, రాదో అనే సందేహం అందరికీ ఉంది. కానీ ఒక చిన్న డ్యాన్స్‌ బిట్‌ చేసి చూపించా. అందరూ ఎగ్జైట్‌ అయ్యారు. అలా మహేశ్‌తో డ్యాన్స్‌ చేయడం చాలా ఎంజాయ్‌ చేశా. ఎలా ఉందో రేపు థియేటర్లో సినిమా చూసి మీరే చెప్పాలి.

షూటింగ్​లో మహేశ్​బాబు-రష్మిక

మహేశ్‌తో ఎవరు హీరోయిన్‌గా చేసినా సితార వారికి ఫ్రెండ్‌ అవుతుంది?

సితార, నేను, ఆద్య ఒక గ్యాంగ్‌. మా ముగ్గురిలో ఎవరితో మాట్లాడాలన్నా.. మిగతా ఇద్దరికి తెలియాల్సిందే.

చిరంజీవి స్టేజ్‌ మీద 'నన్ను కాంట్రాక్ట్‌ తీసుకున్నావా రష్మిక' అనడం గురించి?

'ఛలో', 'గీత గోవిందం' సినిమాల ఈవెంట్స్‌కు చిరంజీవి అతిథిగా వచ్చారు. అప్పుడు 'ఎందుకో మీరు నా లక్కీ ఛార్మ్‌ అనిపిస్తుంది సర్‌' అని చిరుతో చెప్పా. అందుకే ఆయన అలా అనుంటారు. ఆయనది స్వీట్‌ హార్ట్‌. నా ఫంక్షన్స్‌ అన్నింటికీ రావాలని కోరుకుంటున్నాను.

ఈ సినిమా షూటింగ్‌ చాలా తొందరగా పూర్తయింది కదా?

సాధారణంగా అనిల్‌ సర్‌కు స్క్రిప్ట్‌ మీద పూర్తి అవగాహన ఉంటుంది. అలాగే రత్నవేలు వేగంగా పనిచేస్తారు. ఒక సీన్‌ అయిపోగానే, మరో సీన్‌కు వెంటనే షిఫ్ట్‌ అవుతారు. అలా క్లారిటీ ఉన్న దర్శకుడు, ఫాస్ట్‌గా పనిచేసే టీమ్‌ ఉండటం వల్ల షూటింగ్‌ తొందరగా పూర్తి చేయగలిగాం.

సరిలేరు నీకెవ్వరులో హీరో మహేశ్​బాబు

మీ తర్వాతి సినిమా?

ప్రస్తుతం నితిన్‌తో 'భీష్మ' చిత్రం చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఇంకో రెండు చర్చల దశలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details