ఓటీటీ వేదికగా తాను నటించిన కొత్త చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా మీడియాతో ముచ్చటించింది ప్రముఖ నటి కీర్తి సురేశ్.
'మహానటి' తర్వాత నటిగా నా బాధ్యత పెరిగింది. ముఖ్యంగా నాయికా ప్రాధాన్య చిత్రాలు వచ్చినప్పుడు మరింత పర్‌ఫెక్షన్‌తో సినిమా చెయ్యాలన్న తపన ఎక్కువైంది. నటిగా నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నా. మంచి కథలు దొరికితే వెబ్‌సిరీస్ చెయ్యడానికి నేను సిద్ధమే. ఇప్పటి వరకైతే ఎవరూ నన్ను వెబ్‌సిరీస్‌ల కోసం సంప్రదించలేదు. నేనెప్పుడూ అవార్డులు వస్తాయని ఏ సినిమా చెయ్యలేదు.
ఈ పాత్ర కోసమే సన్నబడ్డా
'మహానటి' చిత్రం తర్వాత మంచి కమర్షియల్ సినిమాలు చెయ్యాలనే అనుకున్నా. కానీ 'పెంగ్విన్', 'గుడ్‌లక్ సఖీ', 'మిస్ ఇండియా' లాంటి మంచి కథలు దొరకడంతో వరుసగా నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ వచ్చా. నటిగా ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. ఈ పాత్ర కోసమే నేను సన్నబడాల్సి వచ్చింది. దీనికోసం బాగా కష్టపడ్డా. మొదట చిత్ర టైటిల్, నేను కనిపించిన విధానం చూసి దీంట్లో అందం గురించి చర్చించబోతున్నాం అనుకున్నారు. కానీ, టీజర్ చూశాక అందరికీ ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రం కోసం తమన్ వైవిధ్యమైన బాణీలిచ్చారు. అవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
బాధ.. సంతోషం
ఈ లాక్‌డౌన్ కాలంలో నా నుంచి వరుసగా రెండు చిత్రాలు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల థియేటర్ ఫీల్ మిస్ అవుతున్నామన్న బాధ ఉంది. కానీ, ఇప్పుడు ఓటీటీల వల్ల సినిమా విస్తృతి పెరిగింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలిగే వీలు చిక్కింది. థియేటర్‌లో విడుదలైనా.. ఓటీటీ రిలీజైనా ఒత్తిడి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. సరిగా నిద్ర పట్టదు. ప్రేక్షకులు సినిమాను ఎలా స్వీకరిస్తారు. ఏం మాట్లాడతారు అనే ఆందోళన ఎప్పుడూ అలాగే ఉంటుంది.
ఆ సినిమా చెయ్యట్లేదు
మహేష్‌తో 'సర్కారు వారి పాట' చిత్రం చేస్తున్నా. జనవరి నుంచి ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టే అవకాశముంది. రజనీకాంత్ సర్‌తో 'అణ్నాత్తే' చేస్తున్నా. మలయాళంలో మోహన్‌లాల్ గారి సినిమా చేస్తున్నా. రెండు తెలుగు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. హిందీలో 'మైదాన్' చిత్రంలో నటిస్తున్నా అనేది వాస్తవం కాదు.
'మహానటి' తర్వాత ఒప్పుకున్న తొలి కథ
'మహానటి' తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. నేనిందులో సంయుక్త అనే పాత్రలో కనిపిస్తా. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.. ఓ గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటుంది. ఈ క్రమంలోనే కాఫీకి ఆదరణ ఎక్కువ ఉండే అమెరికాలో 'టీ'ని ఓ బ్రాండ్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? ఓ గొప్ప వ్యాపారవేత్త కావాలనుకున్న తన లక్ష్యం నెరవేరిందా? అనేది మిగతా కథ. దర్శకుడు నరేంద్ర కొత్తవాడైనా సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఓ చిన్న పాయింట్ చుట్టూ ఆయన కథ అల్లుకున్న విధానం నన్నెంతో ఆకర్షించింది.
ఇదీ చూడండి:'కేజీఎఫ్' దర్శకుడితో ప్రభాస్.. ప్రకటన ఎప్పుడంటే?