'శాకుంతలం'తో తొలి అడుగు సినిమాల్లోకి రాకపోయినా ఇప్పటికే చిన్నారి అర్హకు సోషల్ మీడియాలో బోలెడు ఫాలోయింగ్ ఉంది. అందుకే.. "అల్లు కుటుంబం నుంచి నాలుగో తరం వచ్చేస్తోందని చెప్పడానికి గర్వంగా ఉంది. అల్లు అర్హ 'శాకుంతలం' సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది" అంటూ ఈమధ్య అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ప్రకటించడం ఆలస్యం ఈ పాపతో పాటు ఆ సినిమాకూ భారీ క్రేజ్ వచ్చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధానపాత్రలో రూపొందిన ఈ చిత్రంలో అర్హ - యువరాజు భరతుడి పాత్రలో నటించింది. అంటే త్వరలోనే అల్లు అర్హ నటనను చూడొచ్చన్నమాట.
'రాజా ది గ్రేట్'.. రవితేజ కొడుకు!
మామూలుగా బాల నటులుగా చెయ్యడం ఒక ఎత్తైతే.. కళ్లులేని పాత్రను పోషించడం మరో ఎత్తు. 'రాజా ది గ్రేట్' సినిమాలో చిన్నప్పటి రవితేజగా నటించిన మహాధన్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవితేజ కొడుకంటే ఆ మాత్రం టాలెంట్ ఉండకుండా ఉంటుందా.. కాబట్టే, ఆ పాత్రకోసం నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మహాధన్‌ను తీసుకోవాలని నిర్ణయించుకుని తర్వాత రవితేజను ఒప్పించారట.
తాతకు తగ్గ మనవరాలు..
'మహానటి' సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా తెలివి, మంకుతనం, ధైర్యం, ప్రతిభ, జాలి, అల్లరి.. ఇలా ఎన్నో కోణాలున్న పాత్రలో నటించి మెప్పించింది చిన్నారి సాయి తేజస్విని. సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కి పోటీ కూడా ఇచ్చింది. ఆ చిన్నారి ఆయన మనవరాలే మరి. ఆ చిత్రం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు', 'సిరివెన్నెల'.. లాంటి సినిమాల్లోనూ నటించింది. అన్నట్లూ 'మహానటి' సినిమాలో సావిత్రి, జెమినీ గణేశన్‌ల కూతురుగా నటించిన పాప గాయని స్మిత కూతురు 'షివి'.
క్రాక్ సినిమాలో బుడత ఎవరంటే..
'క్రాక్' సినిమాలో రవితేజ, శృతి హాసన్‌ల కొడుకుగా నటించి వాల్ పోస్టర్లలో కూడా భాగం పంచుకుని అందరి దృష్టిలో పడ్డాడు మాస్టర్ సాత్విక్. ఆ సినిమాలో ఈ బుడతడి అల్లరీ, సెటైర్లూ చూస్తే నవ్వాపుకోవడం కష్టమే. ఈ చిన్నారి, క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని వారసుడు. సినిమాలో హీరో కొడుకు పాత్రకోసం బయటి నుంచి బాల నటుల్ని వెతికే పనిలేకుండా తన కొడుకునే పెట్టేశాడట గోపీచంద్.