పెళ్లితో హీరోయిన్ కెరీర్ ముగిసిపోతుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అందులో నిజం లేదని, వివాహమయ్యాకే తాను ఎక్కువ అవకాశాలు అందుకున్నానని ఆకాంక్షసింగ్ చెప్పింది. 'మళ్లీరావా', 'దేవదాస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి.. ఇప్పుడు 'పరంపర' వెబ్ సిరీస్‌తో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా 'ఈనాడు.నెట్'తో ప్రత్యేకంగా సంభాషించారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలెన్నో వెల్లడించారు.
చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ విరామానికి కారణమేంటి?
ఆకాంక్ష: గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది (నవ్వులు). దానికి కారణం కొవిడ్/లాక్‌డౌన్. నా సినిమాల విడుదల విషయంలో ఆలస్యమవుతుందేమో గానీ అవకాశాల్ని అందుకోవటంలో కాదు. ఆది పినిశెట్టితో కలిసి నటించిన ‘క్లాప్’, ‘శివుడు’ (తమిళం, తెలుగు), అజయ్ దేవ్‌గణ్- అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన ‘రన్‌వే 34’ (హిందీ), దీప్తి (నటుడు నాని సోదరి) దర్శకత్వంలో నటించిన ‘మీట్ క్యూట్’ (తెలుగు) చిత్రాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. ఆ లోటును ‘పరంపర’ తీర్చిందనుకుంటున్నా. ఈ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్‌లో నేను రచన అనే శక్తిమంతమైన పాత్ర పోషించా. మహిళలకు స్ఫూర్తిన్నిచ్చే క్యారెక్టర్ ఇది. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.
శరత్‌కుమార్, జగపతిబాబు, మురళీమోహన్ వంటి సీనియర్ నటులతో పనిచేయడం ఎలా అనిపించింది?
ఆకాంక్ష: శరత్‌కుమార్, జగపతిబాబు, మురళీమోహన్.. ముగ్గురూ దిగ్గజ నటులే. వారు లివింగ్ లెజెండ్స్. అలాంటి వీరు ‘పరంపర’ కోసం కలిసి పనిచేయటం గొప్ప విషయం. నటిగా వీరి నుంచి ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగస్వామినైనందుకు చాలా ఆనందంగా ఉంది. వీరితోపాటు నవీన్‌చంద్ర నటనా నన్నెంతగానో ఆకట్టుకుంది. చాలా అద్భుతమైన నటుడతను.
అన్ని చలన చిత్ర పరిశ్రమల్లోనూ పనిచేశారు. భాష పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
ఆకాంక్ష: భాష అనేది ఓ మాధ్యమం మాత్రమే. మనం చెప్పాలనుకున్నది హావభావాలతో చెప్పేందుకు ఎలాంటి భాష అవసరంలేదు. ఎమోషన్ పండించటమే నటిగా నా బాధ్యత. దాని కోసం నా టీమ్ సహాయం చేస్తుంది. నాకు అర్థమయ్యే భాషలో అనువదిస్తుంది. అంతేకాదు, దేన్నైనా త్వరగా గ్రహించే లక్షణం నాలో ఉంది. అందుకే నాకు అంత కష్టమనిపించదు..
నటిగా అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ఆకాంక్ష: నాకు చిన్నప్పటి నుంచే నటన అంటే చాలా ఇష్టం. అయితే నేనెప్పుడూ నటినవుతానని అనుకోలేదు. అందరిలానే నేనూ బాత్‌రూమ్, అద్దం ముందు సరదాగా ట్రయల్స్ వేసేదాన్ని. మా అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నేనూ స్టేజ్‌లపై ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. అలా నన్ను చూసిన ఒకరు ఓ ధారావాహికకు ఆడిషన్ ఇవ్వమన్నారు. నటనపై ఉన్న ఆసక్తితో ఆ ప్రయత్నం చేశా. ‘నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా’ అనే హిందీ ధారావాహిక కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చా. ఫిజియోథెరపిస్ట్ విద్యనభ్యసించిన నేను నటిగా మిమ్మల్ని అలరిస్తారని ఎప్పుడూ ఊహించలేదు.
నటిగా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు సినిమాల్లోకి రావటానికి కారణం?
ఆకాంక్ష: నాకెప్పుడూ కొత్త కొత్త పాత్రలో నటించాలనుంటుంది. అందుకే సినిమాల్లోకి వచ్చా. సినిమా సినిమాకీ పాత్రలు మారుతుంటాయి. విభిన్న గెటప్‌లతో ప్రేక్షకుల్ని అలరించవచ్చు. అదే ధారావాహికలైతే ఒకే పాత్రలో ఏళ్ల తరబడి నటించాలి. ఇప్పటికీ టీవీ నుంచి ఆఫర్లొస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉండటంతో ఆ ఆలోచన మానుకున్నా. భవిష్యత్‌లో మళ్లీ బుల్లితెరపై కనిపిస్తానో లేదో ఇప్పుడు చెప్పలేను.
టీవీ, సినిమా, ఓటీటీ.. వీటిల్లో ఏది మీకు కంఫర్ట్?
ఆకాంక్ష: నాకే కాదు నటులెవరికీ కంఫర్ట్ జోన్ అంటూ ఏమీ ఉండదు. ఎంపిక చేసుకున్న పాత్రకు న్యాయం చేయగలమా? ప్రేక్షకుల్ని మెప్పించగలమా? అనేదే ఆలోచిస్తా తప్ప అది ఏ మాధ్యమంలో విడుదలవుతుందనే విషయాన్ని పట్టించుకోను.
నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?
ఆకాంక్ష: ఎంతోమంది నటులు నన్ను ఇన్‌స్పైర్ చేశారు. ఫలానా వారని చెప్పలేను. నాకు నచ్చిన సినిమాల్లోని పాత్రలన్నీ నాకెంతో స్ఫూర్తినిస్తుంటాయి.
ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాల్ని ఎంపిక చేసుకుంటుంటారు?
ఆకాంక్ష: పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారనో, ఇంకేవో ఆకర్షించే అంశాలున్నాయనో నేనే ప్రాజెక్టును ఓకే చేయను. కథ, నా పాత్ర నచ్చితేనే ఏ సినిమాలోనైనా నటిస్తా.
డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?
ఆకాంక్ష: ముఖ్యంగా రెండు డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. ఒకటి.. యువరాణిగా నటించాలని, రెండు.. బయోపిక్స్‌లో కనిపించాలనేది నా కోరిక.
పెళ్లి తర్వాతే వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అదెలా సాధ్యమవుతోంది?