సినిమాల్లో లేడీ అమితాబ్.. రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్.. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆమె విజయశాంతని. కష్టంలో గుండె ధైర్యం... సాయంలో అమ్మ మనసు.. ఆమె సొంతమని కొందరికే తెలుసు. ఇలా ఎంతో కాలంగా తన అంతర్మథనంలో దాగి ఉన్న విషయాలను పంచుకుందీ నటి. 'సరిలేరు నీకెవ్వరు'తో సినీరంగంలోకి పునః ప్రవేశం చేస్తున్న విజయశాంతి తన కుటుంబం, బాల్యం, పెళ్లి, నలభై ఏళ్ల సినిమాలు, రాజకీయాల గురించి వివరించారు.
13 ఏళ్ల విరామం తర్వాత సినిమాలో నటిస్తున్నారు. ఈ పునఃప్రవేశం కొత్తగా అనిపించిందా?
మధ్యలో చాలా సినిమా అవకాశాలొచ్చాయి... సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాను. ఎక్కడికెళ్లినా మళ్లీ సినిమాలు చేయమని అభిమానులు అడుగుతున్నా చేయలేదు. ఈ క్రమంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి కథతో వచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల చేయలేనని చెప్పేశాను. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' కథతో వచ్చారు. "కథ నచ్చితే చేయండి.. లేకపోతే లేదు.. ఒక్కసారి కథ వినండి" అని కోరారు. ఎన్నికల తర్వాత కథ వింటానని చెప్పా తర్వాత అనిల్ మళ్లీ వచ్చారు. సరే ముందు కథ విందామనుకొని విన్నాను. మొత్తం కథంతా విన్నాక చాలా నచ్చింది. "ఇప్పుడెలాగూ కొంత విరామం దొరికింది. దర్శకుడు మనల్ని దృష్టిలో పెట్టుకొని పాత్రను రాసుకున్నప్పుడు ఎందుకు చేయకూడదు?" అని అనిపించింది. అందుకే నో చెప్పలేకపోయాను.
అప్పుడు 'కొడుకు దిద్దిన కాపురం'- ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'.. ఈ రెండింటి మధ్య కాలంలో మహేశ్‌లో మార్పు గమనించారా?
1988లో కొడుకు దిద్దిన కాపురం చేశాను. దానికి కృష్ణ దర్శకులు. వారి కుటుంబంతో నాకు మొదట్నించి అనుబంధం ఉంది. తెలుగులో నా తొలి చిత్రంలో హీరో ఆయనే. వారిలో మా నాన్న పోలికలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకో ఆయనంటే నాకు చాలా గౌరవం. ఇన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ వారబ్బాయితోనే రీఎంట్రీ చేయడం అంతా దైవ నిర్ణయం. అప్పుడంటే మహేశ్ చిన్నోడు. ఇప్పుడు సూపర్‌స్టార్. చాలా మంచోడు. అంత ఎత్తుకు ఎదిగి కూడా ఒదిగి ఉండడం మహేశ్‌లోని గొప్ప లక్షణం. 13 ఏళ్ల తర్వాత అంతా మారిపోయి ఉంటుంది కదా.. ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో? అనుకున్నా. కానీ ఏడు నెలలు షూటింగ్ సమయం చాలా ప్రశాంతంగా, సంతోషంగా గడిచింది.
ఈ సుదీర్ఘ విరామం ఎందుకొచ్చింది?
ఒక రంగంలో పనిచేస్తున్నప్పుడు మనం దానిపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలనేది నా అభిమతం. సినిమా, రాజకీయాలు... రెండింటికీ సమ న్యాయం చేయలేమనిపించింది. సినిమాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాను. మా అమ్మానాన్నలు నాకిచ్చిన ఈ జన్మకి.. సినిమాలకు సరిగ్గా న్యాయం చేశాననే తృప్తి నాకుంది. సినిమా చేస్తున్నప్పుడు సడెన్‌గా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తే.. ఇది వదిలిపెట్టి అటు పరుగెత్తలేం. ఇలాంటి సమస్యలున్నాయనే సినిమాలు చేయడాన్ని వదులుకున్నాను. నన్ను ఇంతగా అభిమానించిన ప్రజలకు సేవ చేయాలనిపించింది. ఆ సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఉద్యమాల్లో పాల్గొన్నాను. లోక్‌సభ సభ్యురాలిగా పార్లమెంటులో నా గళం వినిపించాను. ఎన్నో పోరాటాల తర్వాత నేను అనుకున్నది సాధించగలిగాననే తృప్తి నాకుంది. అయితే ఇప్పటికీ ఇంకా ప్రజలకు చేయాల్సింది చాలా ఉంది. అనుకోకుండా ఇప్పుడు సినిమా చేయాల్సి వచ్చింది.
మిమ్మల్ని సినీ రంగంలోకి వెళ్లమని ప్రోత్సహించిందెవరు?
నా అసలు పేరు శాంతి. సినిమాల్లోకి ప్రవేశించే ముందు మా అమ్మ నా పేరుకు ముందు విజయను చేర్చింది. మా అమ్మకు నేను సినిమాలు చేయడం ఇష్టం లేదు. చదివించి, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకునేది. మా నాన్నకు మాత్రం నన్ను హీరోయిన్‌గా చూడాలనుండేది. ఆయన ప్రోద్బలంతోనే చిత్రసీమలోకి అడుగుపెట్టా. మా పిన్ని విజయలలిత అప్పటికే సినిమాల్లో నటిస్తున్నారు. ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరిగిన నాకు.. సినిమా జీవితం కొత్తగా అనిపించింది. నేను మొదట తమిళ సినిమాలో నటించా. భారతీరాజా దర్శకత్వంలో 13 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించాను. తెలుగులో విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన 'కిలాడీ కృష్ణుడు' నా తొలి చిత్రం(1979).
ఒక పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు సందేశాత్మక చిత్రాలు చేశారు. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోగలిగారు?
గ్లామర్ పాత్రలు చేయడం నిజానికి నాకిష్టం లేదు. ఏవో పిచ్చిబట్టలిస్తారు. పిచ్చి గంతులు గెంతాలి. ఏముంటుంది ఇందులో? అనిపించేది. ఇది కాదు నేను కోరుకున్నది. సావిత్రి లాగా గుర్తుండిపోయే మంచి పాత్రలు చేయాలని ఉండేది. గ్లామర్ పాత్రలు చేయాల్సి వచ్చిన ప్రతిసారీ.. ఎందుకు మంచి పాత్రలతో రారు? అని నాలో నేను అంతర్మథనం చెందేదాణ్ని. అదృష్టవశాత్తు నాకు ఇటు గ్లామర్.. అటు నటనకు, ప్రతిభకు అవకాశమున్న పాత్రలు రెండూ వరుసగా వచ్చాయి. రెండూ పేరు తెచ్చిపెట్టాయి. ప్రతిఘటన, నేటి భారతం వంటి సినిమాలు పేరు తెస్తున్నాయి కదాని వాటికే పరిమితం కాలేదు. గ్లామర్ పాత్రల్లోనూ రాణించాను. 'కర్తవ్యం' హీరో ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ ప్రధానపాత్రతో కూడిన సినిమాలు ఎక్కువగా చేశాను. అన్ని దశల్లోనూ అప్పుడున్న ప్రధాన హీరోలందరితోనూ జంటగా చేశాను. ఇక 'ఒసేయ్ రాములమ్మ' నా కెరీర్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లింది.
ఒక దశలో స్టార్ హీరోలకు దీటుగా సినిమాలు చేశారు. లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ స్థాయికి చేరుకున్నాక దాన్ని నిలబెట్టుకోవడం ఎలా సాధ్యమైంది?
కారులోనే మేకప్ వేసుకునే వాళ్లం. జనరేటర్ వ్యాన్లలో దుస్తులు మార్చుకునేవాళ్లం. ఇప్పటిలా ప్రత్యేక బస్సులేమీ అప్పట్లో ఉండేవి కావు. ఏసీ కార్లూ ఉండేవి కావు. షూటింగ్‌లో తాటాకు విసనకర్రలు ఉండేవి. నిద్ర సరిగా ఉండేది కాదు. పైగా గ్లామర్ తగ్గకూడదు. చాలు బాబోయ్... అనిపించేది. అయితే చేసే ప్రతి సినిమాను మనసు పెట్టే చేసేదాన్ని. నా మొదటి సినిమాకు రూ.5వేలు తీసుకుంటే.. గరిష్ఠంగా రూ.కోటి వరకూ పారితోషికాన్ని తీసుకున్నా. చేయాలనుకుంటే ఎంతైనా కష్టపడతాను. రాజీపడను. 'కర్తవ్యం' సినిమాలో యాక్షన్ సీన్లున్నాయి. డూప్ లేకుండా చేశాను. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఫైట్లు తప్పనిసరిగా పెట్టేవారు. ఒక సినిమాలో అయితే 30 అడుగుల ఎత్తు మీద నుంచి దూకేశాను. లేడీ బాస్ క్లైమాక్స్ అరకులో తీస్తున్నాం. రైలుపైన షూటింగ్ చేస్తున్నాం. ఒక కంపార్ట్‌మెంటు నుంచి మరో కంపార్ట్‌మెంటుకు దూకాలి. ఆ క్రమంలో పట్టుతప్పింది. పైనుంచి పడిపోయేదాన్ని. రాడ్డు పట్టుకున్నాను. రైలు వేగానికి గాలి తాకిడికి శరీరం ఎగురుతుంది. ఆ సమయంలో అందరూ కలిసి తిరిగి కంపార్ట్‌మెంట్‌లోకి తీసుకొచ్చారు. మరో సినిమా షూటింగ్‌లో మంటల్లో ఇరుక్కుపోయాను. ఇవన్నీ జీవితంలో భాగమే. వేటికి భయపడలేదు. అలా కష్టపడ్డాను. ప్రేక్షకులు ఆదరించారు.
మా వారి పేరు... మా నాన్న పేరు ఒకటే
మా తాతది ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం దగ్గర రామన్నగూడెం. అక్కడే భూములుండేవి. అప్పటి పరిస్థితుల్లో ఆస్తులన్నీ వదిలేసి, నిజాం కాలంలోనే చెన్నైకు వలస వెళ్లాల్సి వచ్చింది. అమ్మానాన్నలు వరలక్ష్మి, శ్రీనివాసప్రసాద్. తర్వాత కాలంలో మా అమ్మానాన్నలు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పాతబస్తీలో వారున్నప్పుడే నేను మా అమ్మ కడుపులో పడ్డాను. ప్రసవానికి మాత్రం మా అమ్మ చెన్నైకు వెళ్లడం వల్ల అక్కడ పుట్టాను. తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మా అమ్మానాన్నలు నాకు చిన్నతనంలో చెబుతుండేవారు. వారికి నేను, నాకొక అన్నయ్య. ఇప్పుడు వారెవరూ లేరు. మావారి పేరు కూడా నాన్న పేరే. అనుకోకుండా లభించిన అదృష్టం ఇది. చెన్నైలోనే చదువుకున్నాను. పదో తరగతి కూడా పూర్తిచేయలేదు. బ్రిలియంట్ స్టూడెంట్‌ను కాదు కానీ, గుడ్ స్టూడెంట్‌ను. నేటి భారతం, ప్రతిఘటన చిత్రాల వరకూ నా ఎదుగుదలను మా అమ్మానాన్నలు చూశారు.
ఎంతో కష్టంగా ప్రతిఘటన చేశా
'ప్రతిఘటన' చేసేటప్పుడు నాకు 18 ఏళ్లుంటాయి. కాలేజీ విద్యార్థిని పాత్ర చేయాల్సిన వయసులో 35 ఏళ్ల లెక్చరర్ పాత్ర చేశాను. పెద్దవారు చేయాల్సిన పాత్రను ఈ అమ్మాయితో చేయిస్తున్నారేమిటా అని అనేవారు. దర్శకులు టి.కృష్ణ ఎవరెన్ని చెప్పినా వినలేదు. "నాకు తెలుసు.. ఈ పాత్రకు శాంతమ్మే న్యాయం చేస్తుంది" అని ఘంటాపథంగా చెప్పేవారు. ఆ సినిమా చేసే సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను. "అన్నా.. ఈసారికి వేరే ఎవరితోనైనా చేయించుకో" అని చెప్పాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. నేనే కావాలని పట్టుబట్టారు. చివరకు ఇతర నిర్మాతలను ఒప్పించి కాల్‌షీట్లు ఇవ్వాల్సి వచ్చింది. 'ప్రతిఘటన' నా కెరీర్‌లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఉషాకిరణ్ మూవీస్‌లో నేను ‘సుందరి సుబ్బారావు, ప్రతిఘటన.. రెండు సినిమాలు చేశాను. రెండూ హిట్లే.
రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి
శ్రీనివాస ప్రసాద్‌తో అనుకోకుండా పరిచయం ఏర్పడింది. ఒకరి అభిప్రాయాలు మరొకరం పంచుకున్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. జరిగిపోయింది. ఇదంతా దీర్ఘకాలంగా కొనసాగిందేమీ కాదు. రూ.కోట్లు ఖర్చుపెట్టి మండపాలేసి ఆర్భాటంగా పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. అందుకే సింపుల్‌గా రిజిస్ట్రార్ ఆఫీసులో చేసుకున్నాం. సన్నిహితుల సమక్షంలో తాళి కట్టారు. పెళ్లంటేనే ఒకరిపై ఒకరికి పరస్పర నమ్మకం ఉండాలి. అది మాలో ఉంది.
ప్రజల కోసమే..!
పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అయితే ఒక దశలో పిల్లలుంటే నాలో స్వార్థం పెరిగిపోతుందనిపించింది. రాజకీయాల్లోకి వచ్చాక 'నా' అనే స్వార్థాన్ని వీడి 'మన' అనే ధోరణితో ముందుకెళ్లాలనిపించింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా ప్రజలకే పూర్తిగా నా జీవితాన్ని అంకితమివ్వాలనుకున్నాను. నా ఆలోచనకు మావారు కూడా అండగా నిలబడ్డారు. ఈ కారణంగా పిల్లలు వద్దనుకున్నాం.
- అమ్మానాన్నలు చనిపోయినప్పుడు నేను ఎక్కువ బాధపడ్డాను. ఆ తర్వాత బాధపడింది దర్శకులు టి.కృష్ణ చనిపోయినప్పుడు. ఆయన చనిపోయినప్పుడు నేను ఊటిలో షూటింగ్‌లో ఉన్నాను. విషయం తెలియగానే నేరుగా ఒంగోలుకెళ్లి, శ్మశానంలో ఆయన్ను అంతిమంగా దర్శించుకున్నాను.
- నాకు ఇందిరాగాంధీ, జయలలిత లాగా అవ్వాలని ఉంటుంది. ప్రతిఘటన సినిమాలో గొడ్డలి పట్టుకునే సీన్ ఒకటుంటుంది. ఈ సీన్ చేస్తున్నప్పుడు మా అమ్మ అక్కడే ఉంది. నన్ను చూసి 'నా బిడ్డ ఇందిరాగాంధీలాగా మాట్లాడుతుంది' అంది.
- రాజకీయాలే నా తొలి ప్రాధాన్యం. విరామంలో ఈ సినిమా చేశాను. ఇక వరుసపెట్టి సినిమాలు చేసే ఆలోచన లేదు. నాకు బాగా నచ్చిన పాత్ర వస్తే సంవత్సరానికి ఒకటో, రెండో చేస్తాను. సమాజంలోని రుగ్మతలను తొలగించే బాధ్యత నా ముందుంది. దానిపైనే నా దృష్టంతా.
ఇవీ చూడండి.. 'సినిమాల మధ్య యుద్ధ వాతావరణమేమి లేదు'