ఒకప్పుడు హీరోలుగా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు కొందరు పరభాషా నటులు. ఇప్పుడు వాళ్లే ప్రతినాయక పాత్రలు పోషిస్తూ విలనిజాన్ని పండిస్తున్నారు. వైట్ కాలర్ నేరస్తులుగా నటనలో వైవిధ్యాన్నీ, కొత్తదనాన్నీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
'కడలి'తో మొదలు
జెంటిల్‌మన్, ఒకేఒక్కడు సినిమాల్లో హీరోగా అర్జున్‌ను తప్ప మరెవర్నీ ఊహించుకోలేం. అర్జున్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. అయితే మణిరత్నం 'కడలి'లో తొలిసారి ప్రతినాయక పాత్ర పోషించి విలన్ల జాబితాలో చేరిపోయారు. తరవాత విశాల్, సమంత నటించిన 'అభిమన్యు', హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన 'లై' చిత్రాల్లోనూ విలన్‌గా నటించారు. తన నటనతో కుర్రకారు హీరోలకూ గట్టి పోటీనిస్తున్నారు.
లంకేశ్వరుడిగా...
ప్రభాస్ సినిమా వస్తోందంటే తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటారు. మరి తన రేంజ్‌కు తగ్గట్టే... తన సినిమాల్లో ప్రతి నాయకుడూ ఉండాలిగా. అందుకే ప్రభాస్ తదుపరి చిత్రం 'ఆదిపురుష్'లో విలన్‌గా నటించేందుకు సిద్ధమయ్యారు సైఫ్ అలీఖాన్. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తే ఈ పటౌడీ వారసుడు లంకేశ్వరుడిగా నెగెటివ్ పాత్రలో అలరించనున్నారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలా ఈ సినిమా కూడా మనకు మరో బాలీవుడ్ హీరోను విలన్‌గా పరిచయం చేస్తోంది.
తెలుగు నేర్చుకుని మరీ...
మణిరత్నం సినిమాల్లో లవర్‌బోయ్‌గా అలరించిన నటుడు మాధవన్. ఈ సొట్టబుగ్గల హీరో తన నటనతో అటు క్లాస్‌నూ... ఇటు మాస్‌నూ బాగా ఆకట్టుకున్నారు. ఈ మధ్య ప్రతినాయక పాత్రలు కూడా పోషిస్తూ విలన్ పాత్రలకు పెట్టింది పేరు అనిపించుకుంటున్నారు మాధవన్. 'సవ్యసాచి'లో నాగచైతన్యతో పోటీ పడి ప్రతినాయక పాత్రను చక్కగా పండించారు. తొలిసారి 'సవ్యసాచి' కోసం తెలుగు నేర్చుకుని తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. అనుష్క 'నిశ్శబ్దం'లోనూ విలన్‌గా మరోసారి సత్తా చాటారు.
ఆ పాత్రకు అవార్డు
తొంభైల్లో రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసుదోచిన నటుడు అరవింద్‌స్వామి. తను నటించిన రోజా, బొంబాయి లాంటి సినిమాలకు ఇంకా క్రేజ్ తగ్గలేదు. అలాంటి అరవింద్‌స్వామి ఇప్పుడు విలన్ పాత్రలో భయపెడుతున్నారు. రామ్‌చరణ్ 'ధృవ'లో ప్రతినాయక పాత్రలో అరవింద్ స్వామి తన నటనలోని మరోకోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తమిళంలోనూ మరికొన్ని సినిమాల్లో విలన్‌గా నటించి, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతినాయకుడిగా అవార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్ 'తలైవి'లో ఎంజీఆర్‌గా నటిస్తున్నారు.
భయపెట్టేస్తున్నాడు
'రక్త చరిత్ర'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన వివేక్ ఒబెరాయ్.. తెలుగు ప్రేక్షకులకు పరిటాల రవిగా సుపరిచితుడు. ఆ సినిమా తర్వాత అనంతపురంలోని ముత్తయ్యకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఆ జిల్లా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. రీల్, రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకుని పాన్ ఇండియా నటుడిగా పేరు తెచ్చుకున్న వివేక్ కూడా విలన్ అవతారమెత్తారు. 'వినయ విధేయ రామ', 'వివేకం', 'లూసిఫర్'లో ప్రతినాయకుడిగా ప్రేక్షకుల్ని భయపెట్టేశారు. మరో తెలుగు సినిమాలోనూ నటించేందుకు సంతకం చేసేశారు.