"మూస కథలతో సినిమాలు చేస్తామంటే ఇప్పుడెవరూ చూడట్లేదు. ముఖ్యంగా కొత్తగా తెరపైకి వచ్చిన నాలాంటి హీరోలు.. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తేనే బాగుంటుంది. విజయ్ సేతుపతి, ఆయుష్మాన్ ఖురానా లాంటి వాళ్లంతా ఇదే పంథాలో నడిచొచ్చి స్టార్లుగా మారారు. అందుకే నేనూ విభిన్న కథాంశాలతోనే మంచి నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నా" అన్నారు ఉదయ్ శంకర్. 'ఆటగదరా శివ', 'మిస్ మ్యాచ్' లాంటి చిత్రాలతో.. తొలి అడుగుల్లోనే సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన కథానాయకుడాయన. ఇప్పుడు 'క్షణ క్షణం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కార్తిక్ మేడికొండ దర్శకుడు. డా.వర్లు, మన్నెం చంద్రమౌళి నిర్మిస్తున్నారు. జియా శర్మ కథానాయిక. శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు ఉదయ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
నా జీవితానికి దగ్గరైన కథ
సస్పెన్స్.. వినోదం.. సమపాళ్లలో మేళవించిన థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగుతుంది. దర్శకుడు కార్తిక్ కథ చెప్పినప్పుడే.. ఇది నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది కదా అనిపించింది. కథలో మలుపులు నన్ను బాగా ఆకర్షించాయి. అందుకే ఒక్క క్షణం ఆలోచించకుండా సినిమాకు ఓకే చెప్పా. నేనిందులో ఓ మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తా. ఇటు వ్యక్తిగత జీవితంలో.. అటు ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. ఇవిలా ఉండగానే.. వీటన్నింటినీ మించిన మరో పెద్ద సమస్యలో చిక్కుకుంటా. మరి ఆ సమస్య ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డా? అన్నది మిగిలిన కథ.
నవ్వులు పంచే కష్టాలు
కథకు సరిగ్గా సరిపోతుందనిపించే ఈ చిత్రానికి 'క్షణ క్షణం' అన్న టైటిల్ ఖరారు చేశాం. సినిమా డార్క్ హ్యూమర్‌గా ఉంటుంది. ప్రథమార్ధమంతా ఒకెత్తు.. ద్వితీయార్ధం మరొకెత్తు. చివరి 20నిమిషాలు ఎవరూ ఊహించలేరు. నిర్మాత బన్నీ వాసు సినిమా చూసి.. 'క్లైమాక్స్ ఊహించలేకపోయా ఉదయ్. ప్రేక్షకుణ్ని కూర్చోబెట్టేలా తీర్చిదిద్దారు. నాకు బాగా నచ్చింద'న్నారు. ఈ చిత్రంలో జియా నాకు భార్యగా కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మా మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. దర్శకుడు చెప్పిన కథ..చెప్పినట్లుగా తీశారు. రోషన్ సాలూరి నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
"కొత్తదనమున్న కథలతో ప్రయాణం చేయడమే నాకిష్టం. ఉదయ్ సినిమా వస్తుందంటే.. మళ్లీ ఏదో కొత్త కథ తీసుకొస్తున్నాడనేలా పేరు తెచ్చుకోవాలి. కథలో ప్రాధాన్యముంటే ఏతరహా పాత్రలు పోషించడానికైనా సిద్ధమే. 'సఖి', 'గీతాంజలి' లాంటి మనసులకు హత్తుకునే ప్రేమకథలో నటించాలనుంది".
అదే సవాల్‌గా అనిపించింది
సినిమా మొత్తం విశాఖపట్టణం నేపథ్యంగా సాగుతుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో విశాఖ ఫిష్ యార్డ్‌లో చిత్రీకరణ జరిపాం. అది సవాల్‌గా అనిపించింది. నిర్మాతలు వర్లు, మౌళి ప్రోత్సాహం లేకుంటే షూటింగ్ పూర్తయ్యేది కాదు. ఇప్పుడున్న టైంలో గీతా ఆర్ట్స్ ద్వారా మా చిత్రం విడుదలవుతుండటం వల్ల ఎక్కువ థియేటర్లు దొరికాయి. అందుకే వారికి థ్యాంక్స్. సినిమాలో కోటీ లాయర్ పాత్రలో నటించారు. నిజానికి ఈ పాత్రకు మొదట సంగీత దర్శకుడు కీరవాణిని అనుకున్నాం.
ఇదీ చూడండి:''చెక్' కొత్తగా ఉండబోతోంది.. ట్రెండ్ సెట్టర్ అవుతుంది'