తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మీ క‌ష్టం క‌నిపిస్తోంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ అన్నారు' - pawan kalyan

'మిస్​మ్యాచ్​'.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరో ఉదయ్ శంకర్.. సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. పవన్​కల్యాణ్​ ఈ చిత్రంలో పాట గురించి మెచ్చుకున్నారని చెప్పాడు. ఆ విశేషాలు మీకోసం.

'మీ క‌ష్టం క‌నిపిస్తోంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ అన్నారు'
హీరో ఉదయ్ శంకర్

By

Published : Dec 4, 2019, 9:11 PM IST

న‌టుడిగా తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాడు ఉద‌య్‌శంక‌ర్‌. 'ఆట‌గ‌ద‌రా శివ‌'తో తెర‌కు ప‌రిచ‌య‌మైన ఇతడు... రెండో ప్ర‌య‌త్నంగా 'మిస్ మ్యాచ్‌'లో న‌టించాడు. ఐశ్వర్య రాజేశ్​ హీరోయిన్. నిర్మల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుందీ సినిమా. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించాడు ఉదయ్.

తొలి సినిమాలో ఫైట్లు, డ్యాన్సులు చేయ‌లేక‌పోయారు. ఆ కోరిక తీర్చుకోవాలనే ఈ క‌థ‌ను ఎంచుకున్నారా?

కొత్త‌గా ప‌రిచ‌య‌మ‌య్యే హీరోలు చాలా మంది మూడు ఫైట్లు, మూడు పాట‌లు, హీరోయిన్‌తో రొమాన్స్‌, చివ‌ర్లో బ‌ల‌మైన విల‌న్‌... ఇలాంటి లెక్కలు వేసుకుని సినిమా చేస్తుంటారు. నేను అలా చేస్తే వాళ్ల‌లో క‌లిసిపోతాను. ఇత‌ను కొంచెం కొత్త‌గా ప్ర‌య‌త్నించాడని చూసేవారు అనుకోవాలి. అందుకోస‌మే తొలి ప్ర‌య‌త్నంగా 'ఆట‌గ‌దరా శివ‌' చేశా. చూసిన చాలా మంది 'బాగా న‌టించావు' అని మెచ్చుకున్నారు. న‌టుడిగా మంచి పేరొచ్చింది. అందుకే రెండో ప్ర‌య‌త్నంగా ప్రేమ‌క‌థ చేద్దామ‌నుకున్నాం.

హీరో ఉదయ్ శంకర్

'మిస్ మ్యాచ్‌' మీ కోస‌మే త‌యారు చేసిన క‌థ అనుకోవ‌చ్చా?

ఎప్పుడైనా క‌థే హీరో. క‌థ బాగుంటేనే సినిమాకు, హీరోకు పేరొస్తుంది. క‌థ త‌ర్వాతే హీరో వ‌స్తాడు. దీనికంటే ముందు ఆరేడు క‌థ‌లు విని, రెండు మూడు ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం. ఇంత‌లో భూప‌తిరాజాగారు వ‌చ్చారు. 'మిస్ మ్యాచ్' గురించి చెప్పారు. ఇందులో త‌ల్లీకొడుకు, తండ్రీ కూతురు అనుబంధంతో పాటు మంచి ప్రేమ‌క‌థ, క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఉంటాయి. అలా ఈ క‌థే మ‌మ్మ‌ల్నంద‌రినీ ఒక చోట‌ుకు తీసుకొచ్చింది.

'మిస్ మ్యాచ్‌' అంటున్నారు. ఏ విష‌యంలో?

హీరో హీరోయిన్ల విష‌యంలోనే. హీరో ఒక ఐటీ ఉద్యోగి. అన్నీ ఒక‌ప‌ద్ధ‌తి ప్ర‌కారం చేస్తుంటాడు. హీరోయిన్ ఏమో ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌. మ‌ట్టిలో నుంచి వ‌చ్చిన అమ్మాయి. ఒక‌రికొక‌రు పూర్తి భిన్నం. అలాంటివాళ్లు ల‌వ్‌లో ప‌డితే మిస్ మ్యాచే క‌దా. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశాం. ఐశ్వ‌ర్య రాజేశ్ ఇందులో రెజ్ల‌ర్‌గా క‌నిపిస్తుంది. ఎంతో అనుభ‌వ‌మున్న ఆమె హీరోయిన్‌ అనగానే భ‌య‌ప‌డ్డా. కానీ మాతో స‌ర‌దాగా క‌లిసిపోయి ఆ ఫీలింగ్ రాకుండా చేసింది.

హీరో ఉదయ్ శంకర్

చిన్న‌ప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు క‌దా. ఆ అంశంతో ఇందులోని మీ పాత్రకి సంబంధం ఉందంట క‌దా?

అది కొద్దివ‌ర‌కు ఉంటుంది. చిన్న‌ప్పుడు నేను గ‌జిబిజిగా క‌నిపించే 30 నెంబ‌ర్లను మూడు సెకన్ల‌లోనే చూసి గుర్తు పెట్టుకొని ఎలా అడిగితే అలా చెప్పేవాణ్ని. తొమ్మిదో త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పుడు చేసిన ఆ ప్ర‌య‌త్నంతో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించా. పై లెక్క‌ల విష‌యంలోనూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కా. అది చేసి ఇర‌వయ్యేళ్ల‌యింది కాబ‌ట్టి ఇప్పుడు మ‌ళ్లీ అవి చేయ‌గ‌ల‌నో లేదో తెలియ‌దు. ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌లేదు. ఇప్పుడు సినిమా సంభాష‌ణ‌ల్ని మాత్రం బాగా గుర్తు పెట్టుకొని చెబుతున్నా.

హీరో ఉదయ్ శంకర్

ప‌వ‌న్‌క‌ల్యాణ్ 'తొలి ప్రేమ‌'లోని ఈ మ‌న‌సే పాట రీమిక్స్ ఆలోచ‌న ఎవ‌రిది?

నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు పెద్ద అభిమానిని. నేను హీరో అయిన తర్వాత ప్రేమ‌క‌థ‌లో న‌టిస్తే త‌ప్ప‌కుండా ఈ పాట పెట్టుకోవాల‌ని అప్ప‌ట్లోనే అనుకునేవాణ్ని. తొలి సినిమాలో కుద‌ర‌లేదు. రెండో సినిమాకు ల‌క్కీగా ప్రేమ‌క‌థ కుదిరింది. ర‌చ‌యిత భూప‌తిరాజాని అడిగితే, ద్వితీయార్థంలో ఈ పాట పెట్టొచ్చన్నారు. ఈ పాట సినిమాలో ప్ర‌త్యేకంగా ఉండాల‌నుకున్నాం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాలు 'తొలి ప్రేమ‌' మొద‌లుకొని 'త‌మ్ముడు', 'బ‌ద్రి', 'ఖుషి'... ఇలా సినిమాల ప్ర‌భావం క‌నిపించేలా పాట‌ను తీర్చిదిద్దాడు విజ‌య్ మాస్ట‌ర్‌. రెండో సినిమాకే ప‌వ‌న్ క‌ల్యాణ్ పాట చేస్తావా అన్నారు చాలా మంది. 'నాకు ఆయ‌న మీద ఉన్న ప్రేమ‌ను చూపిద్దామ‌నే ఈ ప్ర‌య‌త్నం' అని చెప్పా. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఈ పాట మొత్తం చూపించాం. సింగిల్ షాట్‌లో తీశారు క‌దా. అది ఈజీ కాదు. మీ క‌ష్టం క‌నిపిస్తోంది. పాట చాలా బాగుంది, సినిమా కూడా బాగా ఆడుతుంద‌ని అన్నారు.

కొత్త సినిమాల క‌బుర్లేంటి?

ఈ సినిమా ఆడితే ఇంకో సినిమా గురించి ఆలోచిస్తా. కానీ రెండు క‌థ‌లైతే సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక‌టి 'అర్జున్‌రెడ్డి'కి స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన గిరియాద‌వ్ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details