'ఒలింపిక్స్ కంటే ముందే గోపీచంద్ బయోపిక్' - సుధీర్‌బాబు గోపీచంద్ బయోపిక్
'వి' సినిమా విడుదల తర్వాత విలేకర్లతో మాట్లాడిన హీరో సుధీర్‌బాబు.. తర్వాత చేయబోయే గోపీచంద్ బయోపిక్ గురించి చెప్పాడు. టోక్యో ఒలింపిక్స్ కంటే ముందే విడుదల చేస్తామని వెల్లడించాడు.
పాత్ర నిడివికి కాకుండా కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే తక్కువ మంది కథానాయకుల్లో సుధీర్‌బాబు ఒకరు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ వల్ల ఓటీటీలో విడుదలైన సరే మంచి టాక్ అందుకుంది. దీని తర్వాత సుధీర్ బాబు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం సిద్ధమవుతున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ బయోపిక్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం సుధీర్‌బాబు మరింత ఫిట్‌గా తయారవుతూ.. బ్యాడ్మింటన్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకుంటున్నారు. సుధీర్‌బాబు కూడా ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడం విశేషం. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా మీడియాతో ముచ్చటించారు. నిజ జీవిత పాత్రను పోషించాలంటే ముందు ఆ పాత్రలోకి పూర్తిగా లీనం కావాలని పేర్కొన్నారు.
- నాకు బ్యాడ్మింటన్ ఆట తెలుసు. ఇప్పటికే ఇందులో కాస్త నైపుణ్యం ఉంది కాబట్టి భారీ స్థాయిలో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత టాలెంట్‌కు కాస్త మెరుగులు దిద్దితే సరిపోతుంది.
- నిజానికి కొన్ని బయోపిక్‌లు ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ఎందుకంటే ఆ పాత్రలు పోషించిన నటులు కేవలం బాడీ లాంగ్వేజ్‌పై మాత్రమే దృష్టిపెట్టారు. ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు తదితర విషయాలను గమనించి.. పాత్ర సోల్‌ను మిస్ చేశారు. ఒకవేళ మనకు ఆ వ్యక్తి సోల్ తెలియాలంటే.. అతడిని కలిసి ఉండాలి, అతనితో ప్రయాణం చేయాలి. అతడి జీవితంలోని మలుపులు స్వయంగా తెలుసుకోవాలి.
- నేను గోపీచంద్‌తో కలిసి ఎనిమిదేళ్లు ప్రయాణం చేశా. అతడికి పార్ట్‌నర్‌గా బ్యాడ్మింటన్ ఆడా. వీటి ద్వారా కొంత తెలుసుకున్నప్పటికీ.. తెలియాల్సింది చాలా ఉంది. ఆయన జీవితంలోని వ్యక్తుల్ని కూడా కలిసి, వారితోనూ మాట్లాడాలి. ఏ సందర్భంలో ఎలా స్పందిస్తారో తెలిస్తే పాత్రను తెరపై చక్కగా చూపించొచ్చు.
- బ్యాడ్మింటన్ టీవీలో చూస్తున్నప్పుడు చాలా సులభంగా కనిపిస్తుంది. కానీ నిజంగా ఆడటం కష్టం. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆటగాడు తనతో తనే పోటీ పెట్టుకుంటాడు. ఆ సంఘర్షణను మనం మాటల్లో చెప్పలేం.. కేవలం భావాల ద్వారా మాత్రమే చూపించగలం.
- ఈ బయోపిక్ స్క్రిప్టు సిద్ధంగా ఉంది. డిసెంబరులో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 2021 టోక్యో ఒలింపిక్స్ కంటే ముందు చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఎంతో స్ఫూర్తినిచ్చే గోపీచంద్ జీవిత కథ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఈ సినిమా చూసిన తర్వాత కొందరైనా క్రీడాకారులుగా మారితే నా లక్ష్యం నెరవేరినట్లే.