టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల బ్యాంకాక్‌లో స్కై డైవింగ్‌లో తర్ఫీదు పొందుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. సరైన దిశలో ల్యాండ్ అవని కారణంగా శర్వా భుజానికి, కాలికి గాయమైంది. వెనువెంటనే ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చి.. సన్‌షైన్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేశారు. శర్వానంద్‌కు గత కొన్ని రోజులుగా డాక్టర్ గురవారెడ్డి ఆధ్వర్యంలో వైద్య చికిత్స అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. అత్యాధునిక చికిత్స అందించి శర్వానంద్‌కు గాయం త్వరగా మానేలా చేశామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. గాయం తీవ్రత తగ్గడం వల్ల ఈ రోజు శర్వానంద్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
గాయం కారణంగా శర్వానంద్ 2 నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం శర్వా చేతిలో '96' చిత్రంతో పాటు దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న 'రణరంగం' సినిమాలున్నాయి. మరో 2 నెలలు ఆయన ఇంటికే పరిమితమవబోతున్న నేపథ్యంలో ఈ 2 చిత్రాలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీ వర్గాల సమాచారం.