మాస్మహారాజా రవితేజ కెరీర్ విషయంలో జోరు పెంచారు. వరుస సినిమాలను ఓకే చేస్తున్న ఆయన.. తాజాగా పాన్ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడా సినిమా వివరాలను ప్రకటించారు. గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలవగా.. అది ఆసక్తిని రేపుతోంది. 'వేట ప్రారంభమయ్యే ముందు ఉండే నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి' అని క్యాప్షన్ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోంది.
నాగేశ్వరరావు ఎవరంటే?
స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగింపునకు గుర్తుగా 'టైగర్' పేరుతో పిలిచేవారు. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్టే చిక్కి తప్పించుకునేవాడు. ఒకానొక సమయంలో మద్రాస్ జైలు నుంచి కూడా తెలివిగా తప్పించుకున్నాడు. 1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు.
టైగర్ నాగేశ్వరరావు జీవితం గురించి గతంలో ఓసారి దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. 'నాగేశ్వరరావు కేవలం దొంగగా మాత్రమే చాలా మందికి తెలుసు. ఆయన జీవితంలో అంతకుమించిన కోణాలు ఎన్నో ఉన్నాయి. అతడిది రాబిన్‌హుడ్ తరహా జీవితం. దోచుకొచ్చిన సొత్తును పేదలకు దానం చేసేవాడు. స్టువర్టుపురంలో పుట్టిన కారణంగా నాగేశ్వరరావు చదువుకు దూరమయ్యాడు. అందుకే ఎంతో మంది విద్యార్థుల చదువుకు ధన సాయం చేశాడు. ఇలా ఎన్నో కోణాలు నాగేశ్వరరావులో ఉన్నాయి' అని వంశీ పంచుకున్నారు. 'దొంగాట' చిత్రానికి ముందే తాను ఈ బయోపిక్ గురించి పరిశోధన చేసినట్లు తెలిపారు. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరాలు సమకూర్చనున్నారు. కథానాయిక ఇతర నటీనటుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.
రవితేజ.. ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లను ఒకే చేస్తూ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా', దర్శకుడు సుధీర్ వర్మతో ఓ చిత్రం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'భీమ్లానాయక్' నుంచి అదిరిపోయే అప్డేట్