చెర్రీ ఉదారత.. ఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డుకు ఆర్థిక సాయం Hero Ramcharan Ukraine Security: ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో హీరో రామ్‌చరణ్ తన ఉదారతను చాటుకున్నారు. ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ సమయంలో వ్యక్తిగత గార్డ్‌గా పనిచేసిన ఉక్రెయిన్‌కు చెందిన రస్టీకు చరణ్ అండగా నిలిచారు. యుద్ధం మొదలైన తర్వాత రస్టీ కుటుంబసభ్యుల యోగక్షేమాలపై ఆరా తీశాడు చెర్రీ. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రస్టీ భార్య ఖాతాలో కొంత నగదును జమ చేశారు.
ఈ నేపథ్యంలో రస్టీ.. మానవతా దృక్పథంతో ఆదుకున్న రామ్‌చరణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వీడియోను పోస్టు చేశాడు. చరణ్ ఇచ్చిన డబ్బులతో మందులు, ఇతర వస్తువులను కొనుక్కున్నామని రస్టీ తెలిపాడు. క్లిష్ట సమయంలో తమను గుర్తించి ఆదుకున్న రామ్‌చరణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్ వేగం పెంచుతోంది. కొంచెం కూడా ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది.
ఈ క్రమంలోనే మరోసారి ఆర్ఆర్ఆర్ ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు దర్శకుడు రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేసి 'మారాథాన్ ప్రమోషనల్ క్యాంపైన్' చేయనున్నారు. శుక్రవారం(మార్చి 18) నుంచి వరుసగా తొమ్మిది నగరాల్లో మూవీటీం ప్రచారం నిర్వహించనుంది.
ఇదీ చదవండి: 'త్వరలోనే తెలుగులోకి 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం''