ఉరిమే ఉత్సాహం అనే మాటకి ప్రతీక... యువ కథానాయకుడు రామ్. తెరపై ఆయన జోరు చూస్తే... ప్రేక్షకుడిలోనూ అంతే హుషారు వచ్చేస్తుంది. నచ్చింది చేయడాన్ని ఇష్టపడే రామ్, తనకి నచ్చిన సినిమా రంగంలోనే కెరీర్‌ని మలుచుకున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'తో విజయాన్ని సొంతం చేసుకున్న రామ్, త్వరలో 'రెడ్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చెప్పిన విశేషాలేంటో తెలుసుకుందామా.
లాక్‌డౌన్ తర్వాత జీవితం ఎలా ఉంది?
కొత్తగా ఏమీ అనిపించడం లేదు. నాకు ఇంట్లో గడపడమే ఇష్టం. ఉదయాన్నే లేవటం, నా పనులు చేసుకోవడం, వంట చేసుకోవడం, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టీవీ చూడటం..అంతే. ఇప్పుడు ఇంతకంటే చేసేదేం లేదు కదా. అయితే ఈ సమయంలో చాలా మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎవ్వరం ఊహించని విచిత్ర పరిస్థితి ఇది.
అలా ఇబ్బంది పడుతున్నవాళ్లకి మీ సలహా ఏమిటి?
మనకి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యం. కరోనా కారణంగా ఎవరి స్థాయిలో వాళ్లు ఇబ్బందులు పడుతున్నాం. అలాగని నెగిటివిటీనే చూడకూడదు. ఇందులో పాజిటివిటీనీ వెతకాలి. ఇన్నాళ్లూ పరుగులు పెట్టాం కాబట్టి, ఇప్పుడు దొరికిన ప్రశాంతతని ఆస్వాదించాలి.
పుట్టినరోజు నాడు మీరు ఏం చేస్తారు?
పుట్టినరోజు అంటే చిన్నప్పుడు ఆసక్తిగా ఉండేది. కొంచెం పెద్దయ్యాక 'మనం పుట్టినందుకు మనం ఆనందపడకూడదు. మన చుట్టుపక్కలవాళ్లు ఆనందపడాలి' అని ఎక్కడో చదివా. అప్పట్నుంచి సంబరాలు చేసుకోవడం మానేశా. హీరో అయ్యాక, అభిమానుల సందడి చూసి చిన్న ఆనందం కలిగింది. అప్పట్నుంచి వాళ్ల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటా.
లాక్‌డౌన్‌తో 'రెడ్' విడుదల ఆగడం నిరాశపరిచిందా?
సినిమా ఈ రోజు కాకపోతే రేపు విడుదలవుతుంది. కానీ కరోనా సమాజంపై చాలా ప్రభావం చూపింది కదా. దీనివల్ల చాలామందికి తిండి కూడా దొరకడం లేదు. సినిమాలతో మాకు నష్టం వచ్చినా మరో సినిమా నుంచి రాబట్టుకుంటాం. ముందు సమాజం బాగుండాలి.
'రెడ్' కోసం ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేశాయట?
కొన్ని మంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమే. కానీ థియేటర్లలోనే విడుదల చేస్తాం. అక్కడి అనుభవం వేరు కదా. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మాస్ అంశాలు ఉన్నాయి. అవన్నీ థియేటర్లలో చూస్తేనే కిక్ ఉంటుంది.
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత 'రెడ్' చేయడానికి కారణం?
ఇస్మార్ట్ శంకర్'కు ముందే ఇక నుంచి ప్రయాణం భిన్నంగా ఉండాలనుకున్నా. 'ఇస్మార్ట్..' తర్వాత కూడా మళ్లీ ప్రేమకథలు చేయాలనిపించలేదు. 'రెడ్' కథ అయితే కొత్తగా ఉంటుందనిపించింది. ఇందులో ద్విపాత్రాభినయం చేశా. 'ఇస్మార్ట్...' చూసి రామ్ ఇలా చేశాడేంటి? అని ప్రేక్షకులు షాక్ అయ్యారు. అలా ప్రతి సినిమాకీ షాక్ ఇస్తే బాగుంటుంది కదా (నవ్వుతూ).
లుక్ పరంగానూ మీలో మార్పు కనిపిస్తోందే..?