"ఇదే నా జీవితం అనుకుని చేసిన చిత్రం 'పలాస 1978'. నటుడిగా నన్ను నిరూపించుకోవడానికి ఇదొక చక్కని అవకాశం. నేనిలాంటి సినిమా నా జీవితంలో మళ్లీ చేస్తానో లేదో కూడా తెలియదు" అంటున్నాడు కథానాయకుడు రక్షిత్. 'లండన్ బాబులు' చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరో ఇతడు. తాజాగా 'పలాస' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకుడు. నక్షత్ర కథానాయిక. ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకర్లతో ముచ్చటించాడీ హీరో.
"ఇదొక వైవిధ్యమైన పీరియాడికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథ రాసుకున్నారు. 1978 - 2018 మధ్య కాలంలో నడిచే కథ. నేనిందులో మోహన్‌రావు అనే జానపద పాటగాడిగా నటించా. 18 ఏళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల ముసలాడి వరకు మొత్తం నాలుగు గెటప్పుల్లో కనిపిస్తా. ఓ జానపద కళాకారుడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా రౌడీగా ఎలా మారాడన్నది చిత్ర కథాంశం. చిత్ర పేరుకు తగ్గట్లుగానే సినిమా చిత్రీకరణ మొత్తం పలాస పరిసర ప్రాంతాల్లోనే చేశాం. నిజానికి ఈ సినిమా చిత్రీకరణను రెండు నెలల్లోనే పూర్తి చేశాం. ఎడిటింగ్, నేపథ్య సంగీతం విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాం. నా పాత్ర కోసం చాలా కష్టపడ్డా. ఇందులో 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర కోసం ఆరు నెలలు గెడ్డం పెంచడమే కాకుండా 15 కిలోలు బరువు తగ్గించుకొని చేశా. మళ్లీ 18 ఏళ్ల కుర్రాడిగా కనిపించడం కోసం 5 కిలోలు బరువు పెరిగా. ఈ పాత్ర కోసం డప్పు కొట్టడం, జానపద నృత్యాలు, శ్రీకాకుళం యాసలో మాట్లాడటం నేర్చుకున్నా. 'రంగస్థలం' కన్నా వాస్తవికతకు అత్యంత దగ్గరగా ఉండే చిత్రమిది. తమిళంలో వచ్చిన 'అసురన్' చిత్రంతో 'పలాస'ను పోల్చి చెప్పొచ్చు. దర్శకుడు సుకుమార్ సినిమా చూసి.. 'ఏ హీరో అయినా ఈర్ష్య పడేంతటి పాత్ర పోషించావు' అని ప్రశంసించడం చాలా సంతోషాన్నిచ్చింది."