ప్రయోగాలు చేసేందుకు విభిన్న పాత్రలతో మెప్పించేందుకు నేనెప్పుడూ సిద్ధమే అంటున్నారు యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. ఆయన నుంచి వచ్చిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. విజయ్ కుమార్ కొండా దర్శకుడు. మాళవిక, హెబ్బా పటేల్ కథానాయికలు. ఈ చిత్రం గురువారం సాయంత్రం ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా ఆన్లైన్ మీడియాతో ముచ్చటించారు.
వెండితెర లక్ష్యంగా తెరకెక్కిన చిత్రమిదీ. ఓటీటీ ద్వారా ప్రేక్షకులు ముందుకొచ్చినందుకు ఎలా ఉంది?
కరోనా పరిస్థితులు వల్ల సినిమా విడుదల వాయిదా పడినందుకు కాస్త బాధగానే అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఓటీటీనే చక్కటి వేదిక. ప్రేక్షకులు బాగా నవ్వుకోవాలి అనే ఉద్దేశంతో చేశాం. అది ఇలా నెరవేరుతున్నందుకు బృందమంతా సంతోషంగా ఉంది.
ఒరేయ్ బుజ్జిగాతో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
దర్శకుడు విజయ్‌తో నాకు ముందు నుంచి మంచి స్నేహ బంధముంది. తను కథ చెప్తున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నా. అందుకే ఈ వినోదాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తే బాగుంటుంది అనిపించి చేశా.
ఈ చిత్ర కథేంటి? మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
కన్ఫ్యూజన్ కామెడీ కథాంశంతో రూపొందించిన చిత్రమిది. నేనిందులో బుజ్జి అనే పాత్రలో కనిపిస్తా. దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంటుంది.