తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ 10 రోజుల్లో యువతలో మరో కోణాన్ని చూశాను' - హీరో నిఖిల్​ తాజా వార్తలు

కరోనాపై పోరులో భాగంగా సినీ తారలంతా తమ వంతు సాయంగా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే యువ కథానాయకుడు నిఖిల్​ వైద్యులకు, పోలీసులకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని అందజేస్తున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్​ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

hero nikhil special interview about corona virus and also his personal life
ఈ 10రోజుల్లో యువతలో మరో కోణాన్ని చూశాను

By

Published : Apr 5, 2020, 9:19 AM IST

యుద్ధం జరుగుతున్నప్పుడు వీరులకి కావల్సిన సామగ్రిని చేరవేయడం కూడా కీలకమే. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో అలాంటి బాధ్యతనే నిర్వర్తిస్తున్నారు యువ కథానాయకుడు నిఖిల్‌. ఆయన వైద్యులకి, పోలీసులకి వ్యక్తిగత రక్షణ సామగ్రిని అందజేస్తూ కరోనాపై పోరులో భాగం పంచుకుంటున్నారు. మరోపక్క కొత్త సినిమాల కోసం ఇంట్లో ఉంటూనే సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌ చెప్పిన విశేషాలివి.

కరోనాపై పోరాటంలో పోలీసులు, వైద్యులకి వ్యక్తిగత రక్షణ సామగ్రిని పంపిణీ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

"ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వనరులు చాలా కీలకం. ఎన్‌ 95 మాస్క్‌లు, ఇతర వ్యక్తిగత రక్షణ సామగ్రి విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొరత ఉంది. నాకున్న పరిచయాల ద్వారా నేరుగా విక్రేతల నుంచే మాస్క్‌ల్ని, ఇతర సామగ్రిని తెప్పించి పంపిణీ చేస్తున్నా. గాంధీ, నీలోఫర్‌తోపాటు పలు ఆస్పత్రుల్లోనూ అలాగే వరంగల్‌, రాజమండ్రి, గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాలకి వ్యక్తిగత రక్షణ సామగ్రిని పంపించా. పోలీసులు, వైద్యులకి అండగా నిలవాల్సిన సమయమిది. వాళ్లవీ జీవితాలే కదా. చిన్న ఆయుధం ఇచ్చి యుద్ధం చేయమంటే ఎలా? వాళ్ల వ్యక్తిగత సంరక్షణ కోసం అందరూ బాధ్యత తీసుకోవాల్సిందే."

నిఖిల్​

ఈ విపత్తుతో వ్యక్తిగతంగా మీరు నేర్చుకున్న పాఠాలున్నాయా?

"బాధ్యత అంటే ఏమిటో బాగా అర్థమైంది. ప్రకృతి పట్ల, సమాజం పట్ల మరింత బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నా. 19వ శతాబ్దంలో స్పానిష్‌ ఫ్లూ వచ్చిందట. ఈ శతాబ్దంలో కరోనా రూపంలో అలాంటి విపత్తు వచ్చిందేమో. మనల్ని మనం చాలా విషయాల్లో ప్రశ్నించుకునేలా చేసిందీ కరోనా."

లాక్‌డౌన్‌ సమయాన్ని ఇంట్లో మీరెలా గడుపుతున్నారు?

"కుటుంబంతో గడుపుతున్నా. వ్యాయామం చేస్తున్నా. వీలైనంత వరకు ఎవరికి అవసరం ఉందంటే వాళ్లకి సహాయం చేయడంపై దృష్టి పెడుతున్నా. కొన్నాళ్లుగా చాలా సినిమాల్ని మిస్‌ అయ్యా. వాటన్నిటినీ వరసబెట్టి చూస్తున్నా. వెబ్‌ సిరీస్‌లు కూడా చూశా."

చొక్కా విప్పి కనిపిస్తా

నిఖిల్​ కొత్త లుక్​

"కార్తికేయ 2’ కాన్సెప్ట్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక గీతా ఆర్ట్స్‌లో సినిమా సుకుమార్‌ సర్‌ కథతో తెరకెక్కుతోంది. నేను రాసిన కథల్లో అత్యుత్తమమైన కథ అని ఆయన అంటున్నారు. ‘కార్తికేయ 2’లో ఒక సీన్‌లో చొక్కా విప్పాల్సి ఉంటుందని చందు మొండేటి చెప్పారు. అందుకే సిక్స్‌ప్యాక్‌ చేస్తున్నా. అందులో కొన్ని విషయాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి’"

సిక్స్‌ప్యాక్‌ కూడా చేస్తున్నట్టున్నారు. ఇంటినే వ్యాయామశాలగా మార్చుకున్నారా?

"చాలామంది జిమ్‌కి వెళ్తేనే వ్యాయామం చేసినట్టుగా భావిస్తారు. ఇంట్లో మనకున్న వసతులు, కొన్ని వస్తువులతోనే వ్యాయామం చేయొచ్చు. యూట్యూబ్‌లో బోలెడన్ని జిమ్‌ వీడియోలు ఉన్నాయి. వాటిని చూస్తూ హాయిగా ఇంట్లోనే సిక్స్‌ప్యాక్‌ చేసేయొచ్చు. నాకు ఇంట్లో ఐదారు డంబెల్స్‌ ఉన్నాయి. వాటితోనే వర్కౌట్లు చేస్తున్నా."

ఇంట్లో ఉండమన్నా బయట తిరిగే యువతరం గురించి?

"తెలివి, ధైర్యం, బాధ్యత అన్నీ యువతరంలో కనిపిస్తుంటాయి. కానీ ఒకరిద్దరు తప్పు చేసినా అది అందరికీ చెడ్డ పేరు తెస్తోంది. 99 శాతం మంది చాలా బాధ్యతగా మెలుగుతున్నారు. ఈ పది రోజుల్లో యువతలో మరో కోణాన్ని చూశాను. ఆహారం పంపిణీ చేసిన వాళ్లని, పోలీసులకి సాయంగా నిలిచిన వాళ్లనీ చూశా. వాళ్లు నాకు స్ఫూర్తినిచ్చారు. మిగిలిన ఆ ఒక్కశాతం యాటిట్యూడ్‌ ఉన్న అబ్బాయిలకి చెప్పేదేమిటంటే కరోనా మనకు రాదులే అని బయటకొస్తే మాత్రం సమస్యలు కొని తెచ్చుకుంటారు."

నిఖిల్​ కొత్త సినిమా

ఇప్పటికే మీ పెళ్లి సందడి మొదలవ్వాల్సింది కదా?

"ఏప్రిల్‌ 16న పెళ్లి అనుకున్నాం. కరోనా పరిస్థితులతో వాయిదా వేశాం. లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు కూడా, మంచి ముహూర్తం కదా ఆ రోజే గుడిలో పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ గుడులు కూడా మూసేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈసారి పెళ్లి ముహూర్తం ఫిక్స్‌ చేస్తాం. మేము మేలో అనుకుంటున్నాం."

సైన్స్‌ కలిపింది

"నేను, నాకు కాబోయే భార్య పల్లవి వర్మ కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కలిశాం. నిశ్చితార్థానికి ఆరు నెలల ముందే పల్లవిని కలిశా. నాకు సైన్స్‌ అంటే ఇష్టం. తను డాక్టర్‌ కాబట్టి సైన్స్‌ గురించి బాగా మాట్లాడింది. తన మాటల్లో ఇంటెలిజెన్స్‌ నాకు నచ్చింది. నాకు తగిన అమ్మాయి అని ఆ క్షణమే అనిపించింది. ఆ తర్వాత కలిసినప్పుడు తనతో ప్రేమిస్తున్నానని కూడా చెప్పలేదు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పా. అలా మా పెళ్లి కుదిరింది. నా ప్రేమ గురించి మా ఇంట్లో చెప్పగానే వాళ్లు చాలా రిలీఫ్‌ అయ్యారు. పల్లవిని కలవకుండా ఉండుంటే ఇప్పట్లో పెళ్లి చేసుకునేవాడిని కాదేమో."

ABOUT THE AUTHOR

...view details