కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులతో పాటు, పలువురు ప్రముఖులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ కథానాయకుడు నిఖిల్ ట్విట్టర్లో స్పందిస్తూ.. కరోనాతో సమాజంలో నెలకొన్న పరిస్థితులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజలంతా తప్పక నియమాలను పాటిస్తూ కరోనాను పోరాటం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
'కరోనాపై పోరాటంలో ధైర్యాన్ని కోల్పోవద్దు!' - కరోనా సంక్షోభంపై హీరో నిఖిల్ స్పందన
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియో సందేశాన్నిచ్చారు యువ కథానాయకుడు నిఖిల్. కొవిడ్‌తో సమాజంలో నెలకొన్న పరిస్థితులపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. కళ్లేదుటే ప్రాణాలు పోతున్నా కాపాడలేని దుస్థితికి నెలకొందని ఆయన అన్నారు. అయితే ఎలాంటి పరిస్థితిలోనూ ధైర్యాన్ని కోల్పోకుండా మహమ్మారిపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
"కొవిడ్ సంక్షోభంలో షూటింగ్ రద్దు అవ్వడం వల్ల గతకొన్ని రోజులుగా మేమూ ఇంటికే పరిమితమయ్యాం. ఈ ఖాళీ సమయంలో మా స్నేహితులతో కలిసి ఓ చిన్న టీమ్‌గా మారి సోషల్‌మీడియా ద్వారా వచ్చిన అభ్యర్థనలకు తగిన సహాయాన్ని అందిస్తున్నాం. కానీ, నిజమేమింటంటే ఇది కూడా సరిపోదు. ఎందుకంటే బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆక్సిజన్, మెడికల్ ఎమర్జెన్సీ కావాలని అడిగిన కొద్దిసేపటికే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు జాగ్రత్తలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితిలోనూ రాజకీయ నాయకులు వాళ్లని వాళ్లు విమర్శించుకుంటూ బిజీగా ఉన్నారు. అయినా కొంతమంది ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారికి తోచిన సహాయసహకారాన్ని అందిస్తున్నారు. దీని వల్ల మనలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని తెలుస్తుంది. ధైర్యాన్ని విడవద్దు. కరోనాపై అందరం కలసికట్టుగా పోరాడదాం" అని యంగ్ హీరో నిఖిల్ అన్నారు.
ఇదీ చూడండి:అవసరమైతేనే బయటకు రండి: మహేశ్‌బాబు